శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (15:50 IST)

పదవ తరగతి.. పరీక్షల ఫలితాలపై హైపవర్‌ కమిటీలు

ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఫలితాలు ప్రకటించడంపై అనుసరించాల్సిన విధి విధానాలను రూపొందించడానికి విశ్రాంత ఐఏఎస్‌ అధికారిణి ఎం.ఛాయారతన్‌ చైర్‌పర్సన్‌గా ప్రభుత్వం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీకి ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ ఎ.సుబ్బారెడ్డి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి, ప్రకాశం జిల్లా డీఈవో సుబ్బారావు సభ్యులుగా ఉంటారు. అయితే వీరితో పాటు కమిటీలో మరో ఆరుగురు నిపుణులను నియమించారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్‌ చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఈ కమిటీ పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఏయే మార్కులను పరిగణలోకి తీసుకోవాలో ప్రభుత్వానికి సూచనలు అందిస్తుంది. ఇక ఇంటర్మీడియేట్‌ పరీక్ష ఫలితాలను అనుసరించాల్సిన విధి విధానాలను నిర్ణయించేందుకు ఛాయారతన్‌ నేతృత్వంలోనే మరో హైపవర్‌ కమిటీని కూడా విద్యాశాఖ నియమించింది. ఈ కమిటీ సూచనల మేరకు ఇంటర్‌ ఫలితాలను ప్రకటిస్తామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు.
 
కాగా, టెన్త్‌, ఇంటర్మీడియేట్‌ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం కాగా, కరోనా కాలంలో పరీక్షలను రద్దు చేయాలంటూ డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో చివరకు పదో తరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షలను రద్దు చేసింది ప్రభుత్వం. ఇప్పుడు ఫలితాలను వెల్లడించేందుకు కమిటీలను నియమించింది. త్వరలోనే టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.