శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 29 మే 2021 (12:32 IST)

కోవిడ్-19 పై సందేహాలు- సమాధానాలు

కోవిడ్-19 మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రెండో విడతలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా యువతపైనే ఉంటోంది. కుటుంబంలో ఒక్కరికి వైరస్ సోకినా మిగతా కుటుంబ సభ్యులందరికీ సులభంగా వ్యాపిస్తోంది. చాలా మందికి వైరస్ అంటే భయం, ఆందోళను పెరిగిపోతున్నాయి.

దీనికితోడు సామాజిక మాధ్యమాలలో వస్తున్న కరోనా సమాచారంతో ప్రజలు తమకు తోచిన విధంగా మందులు వాడుతూ ఇబ్బందిపడుతున్నారు. మరికొందరు అప్పటికప్పుడు రిలీఫ్ అనిపించినా కోలుకున్నతర్వాత మళ్లీ వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ వైరస్ కు సంబంధించిన పూర్తి సమారాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోవిడ్ పై అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండండి.
 
1. కోవిడ్ వైరస్ వల్ల ఎక్కువగా ఎవరు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు?
* దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నవారు,  కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న వాళ్లు చాలా ఎక్కువ ఒత్తిడికిగురవుతున్న వారు.
 
2. కోవిడ్ లో కొమార్బిడ్ కండిషన్స్ అంటేఏంటి? 
* డయాబెటిస్, అధిక బరువు 
* ఆస్తమా, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల సమస్యలు.
* గుండె, కిడ్నీ, లివర్, కిడ్ని సంబంధిత దీర్ఘకాలిక సమస్యలు.
 
3. కోవిడ్ వల్ల అతి తక్కువ రిస్క్ ఉన్న వారు ఎవరు?
* రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు.
 
* 18 ఏళ్లలోపు పిల్లలు
 
* ఒకసారి కోవిడ్ వైరస్ వచ్చి కోలుకున్నవారు.
 
ప్రస్తుతం వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి
 
4. కోవిడ్ ఇన్ఫెక్షన్ లో కనిపించే స్వల్ప లక్షణాలు ఏంటి? 
* గొంతు నొప్పి, కొద్దిగా పొడిదగ్గు, వాసన తెలియక పోవడం, ముక్కు దిబ్బడ.
 
* తలపోటు, ఒళ్ళు నొప్పులు.
 
* విరేచనాలు ( పిల్లలలో ఎక్కువ).
 
5. కోవిడ్ ఆర్టీపీసీఆర్/ ర్యాపిడ్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చి నప్పటికీ, కొందరిలో ఇన్ఫెక్షన్ ఎందుకు కనిపిస్తోంది?
* ఇంట్లో ఒకరికి పాజిటివ్ వచ్చిందని తెలియగానే.. వెంటనే మిగతావారు కూడా వెంటనే టెస్ట్ చేయించడం. 
* లక్షణాలు మొదలైన మొదటి లేదా రెండో రోజు టెస్ట్ చేయించడం ( ఐసోలేషన్ లో ఉండి కనీసం 3 రోజుల తర్వాత టెస్ట్ చేయించడం మంచిది) 
 
* ముక్కులో నుండి శాంపిల్ సరిగా తీయకపోవడం 
 
6. కోవిడ్ పాజిటివ్ పేషెంట్ వద్ద ఉంచుకోవలసినవి?
* ధర్మ మీటర్: 101 F కన్నా ఎక్కువ ఉంటే ఎక్కువ జ్వరం ఉన్నట్టు.
 
* పల్స్ ఆక్సీ మీటర్: ఆక్సిజన్ లెవెల్స్ 94%కి తగ్గకూడదు. ( 6 నిమిషాలు నడిచిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ చూసుకోవడం మంచిది) 
 
* అత్యవసరమైన పరిస్థితులు తలెత్తితే డాక్టర్ లేదా హాస్పిటల్ కు సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఉండడం మంచిది.
 
7. కోవిడ్ టెస్టులని ఏ విధంగా అర్థం చేసుకోవాలి?
* ఆర్టీపీసీఆర్/ ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చి.. సిటి స్కాన్ రిపోర్ట్ లో నార్మల్ వస్తే- కొద్దిపాటి ఇన్ఫెక్షన్ మాత్రమే ఉన్నట్టు. వైరస్ ఇంకా ఊపిరితిత్తులకు చేరలేదు అని అర్థం. 
 
* ఆర్టీపీసీఆర్ / ర్యాపిడ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చి, సిటీ స్కాన్ రిపోర్ట్ లో కొరాడ్ 4/5 ఉంటే- ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టే. ఆ తీవ్రత ఎంత అన్నది స్కోరింగ్ ను బట్టి తెలుస్తుంది.  
 
* ఆర్టీపీసీఆర్ / ర్యాపిడ్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చి, సిటీ స్కాన్ రిపోర్ట్ లో కొరాడ్ 4/5- కోవిడ్ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల్లో ఉన్నట్టే, ఆర్టీపీసీఆర్ రిపోర్టు తప్పు (false negative).
 
8. కోవిడ్ పేషెంట్లకు సిటీస్కా న్ ఎప్పుడు అవసరం?
* ఐదు రోజులకుపైగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వారికి.
 
* మొదట జ్వరం తగ్గినా, తిరిగి రెండో వారంలో దగ్గు/ జ్వరం/ విరేచనాలు మొదలైన లక్షణాలున్న వారికి.
 
* ఆక్సి మీటర్లో 94 % కన్నా తక్కువ ఆక్సిజన్ లెవెల్స్ చూపుతున్నవారికి.
 
9. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎందుకు తగ్గుతున్నాయి? 
* ఊపిరితిత్తుల్లో వైరల్ ఇన్ఫెక్షన్ నిమ్ము.
 
* ఊపిరితిత్తులలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం.
 
* ఇన్ఫెక్షన్ కి రియాక్షన్ గా వచ్చే కొన్ని రకమైన మార్పులు. (రెండోవారంలో).
 
10. కోవిడ్ వచ్చిన వారిలో ప్రమాదకర సంకేతాలు ఎప్పుడు?
* ఐదు రోజులకు మించి తీవ్ర జ్వరం ఉన్నట్టయితే. (>101F).
 
* పెరుగుతున్న పొడిదగ్గు, పడుకున్నా, మాట్లాడుతున్నా దగ్గు రావడం.
 
* రోజువారి పనులలో ఆయాసం, విపరీతమైన నీరసం ఉండడం.
 
11. కోవిడ్ లక్షణాలు ఉన్నప్పటికీ.. లేదు అనుకుని మభ్యపడడానికి కారణాలు?
* ర్యాపిడ్ /ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రావటం.
 
* మొదటి రెండు మూడు రోజుల్లో చేసిన సిటీస్కాన్ నార్మల్ గా ఉండటం.
 
* టైఫాయిడ్ లేదా మలేరియా అనుకుని పొరబడటం.
 
12. ఇంట్లో హోంఐసోలేషన్లో ఉండే కోవిడ్ పేషెంట్స్ ఆరోగ్యం విషమించడానికి కారణాలు?
* డోలో /పారాసిటమాల్ రోజుకి 4 సార్లు వేసుకుని జ్వరం లేదనుకోవడం.
 
* ఆయాసం మొదలయ్యే వరకు ఆక్సిమీటర్ తో ఆక్సిజన్ లెవెల్స్ చూడకపోవడం.
 
* డాక్టర్ సలహా లేకుండా సొంత వైద్యం, ఇతర పేషెంట్లు ప్రిస్క్రిప్షన్ ను వాడుకోవడం.
 
13. కోవిడ్ లక్షణాలు ఉన్నప్పటికీ ఎలాంటి మానసిక స్థితి వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? 
* నాకు అసలు కోవిడ్ లేదనుకోవడం. జ్వరం రావడం మామూలే అనుకోవడం.
 
* మీడియా ప్రభావం: హాస్పిటల్ లో డాక్టర్ దగ్గరికి వెళ్తే అనవసరంగా ట్రీట్మెంట్ చేస్తారు అని సొంత వైద్యం చేసుకోవడo.
 
*నిర్లక్ష్యం: ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం సాధారణమే అనుకొని ఎదురు చూస్తూ ఉండడం.
 
14. కోవిడ్ తీవ్రతను నిర్ధారించడానికి చేసే పరీక్షలు?
* సిటీస్కాన్ తీవ్రత స్కోర్ ని బట్టి అంచనా వేస్తారు. (కొరాడ్ ని బట్టి కాదు)
 
* ఫెరిటిన్(Ferritin), సీఆర్పీ(CRP), ఎల్డీహెచ్(LDH) - ఊపిరితిత్తుల్లోని రియాక్షన్ ని అంచనా వేస్తాయి.
 
* డి-డైమర్ - రక్తనాళాలలో బ్లడ్ క్లాట్ అయ్యే స్థితిని అంచనా వేస్తాయి.
 
15. కోవిడ్ మందులు ఎలా పనిచేస్తాయి?
* రెమ్డెసివిర్, ఫ్యాబిఫ్లూ, డాక్సి, ఐవర్మెక్టిన్ కరోనా వైరస్ ని చంపుతాయి. (కొంతవరకు)
 
* స్టెరాయిడ్ లు- రెండోవారంలో వచ్చే ఇన్ఫ్లమేషన్ (reaction)ను తగ్గిస్తాయి.
 
* బ్లడ్ తిన్నర్స్-రక్తనాళాల్లో క్లాట్స్ రాకుండా నివారిస్తాయి.
 
16. కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉన్న వారు ఇంట్లో చేయవలసినవి?
* బోర్లా పడుకోవడం, ప్రాణాయామం చేయడం.
 
* కనీసం రెండు లీటర్లనీళ్లు తాగడం.
 
17. కోవిడ్ నివారణ కోసం ఏ రకమైన మాస్కులు ఉపయోగించడం మంచిది?
* ఎన్-95: ఎక్కువ మందితో కలిసేవారికి ఇవి ఉత్తమం. వీటిని ఉతక కూడదు, 3-4 రోజులు వాడవచ్చు.
 
* సర్జికల్ మాస్కులు: ఒకసారి వాడిన మాస్కును మళ్లీ వాడకూడదు. రోజు మారుస్తూ ఉండాలి. వీటిని కూడా ఉతక కూడదు.
 
* క్లాత్ మాస్కులు: ఈ మాస్కును కూడా ప్రతి రోజూ మార్చుకోవాలి. దీన్నయితే శుభ్రంగా ఉతుక్కోవచ్చు. 
 
18. కోవిడ్ వ్యాక్సిన్ల గుర్తించి తెలుసుకోవలసినవి?
* వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ కోవిడ్ ఇన్ఫెక్షన్ రావచ్చు. అయితే వారికి సీరియస్ అయ్యే అవకాశాలు 
అరుదు.
 
* రెండు డోస్ ల మధ్య అంతరం ఎక్కువైనప్పటికీ ఫలితాన్నిస్తాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు. 
 
* వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత జ్వరం రెండు రోజులకు మించి ఉండదు. అంతకన్నా ఎక్కువ ఉంటే కోవిడ్ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి.
 
19. కోవిడ్ నుంచి కోలుకున్నట్టు ఏ టెస్ట్ ద్వారా తెలుస్తుంది?
* హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి 14 రోజుల తర్వాత వైరస్ లేనట్టే భావించవచ్చు. వారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ అవసరం లేదు.
 
* ఆక్సిజన్ మీద హాస్పిటల్ లో ఉన్నవారికి డిశ్చార్జ్ అయినప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
 
* సిటీస్కాన్ తిరిగి చేయాల్సిన అవసరం లేదు. స్కానింగ్ లో మార్పులు నెల రోజుల వరకు కూడా ఉండొచ్చు. అది ఇన్ఫెక్షన్ ఉన్నట్టు కాదు.
 
20. కోవిడ్ మనకు ఏం నేర్పింది?
* డబ్బుతో అన్నీ కొనలేరు: మానవ సంబంధాలను కూడా.. కాబట్టి అంతులేని పరుగు మానండి.
 
* స్వచ్ఛమైన గాలి, నీరు, వెలుతురు, నేల వెలకట్టలేనివి. అవి మనకు అందుబాటులోలేనపుడే వాటి విలువ
తెలిసింది.