బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 ఆగస్టు 2024 (09:46 IST)

సీఎంగా వుండివుంటే విభజన చేసిన జిల్లాలను మళ్లీ కలిపేవాడిని : నల్లారి

nallari kiran kumar reddy
గత వైకాపా ప్రభుత్వం జిల్లాలను విభజన చేసి తప్పు చేసిందని, ఇపుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నట్టయితే విడదీసిన జిల్లాలను కలిపివుండేవాడినని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం జిల్లాలను విభజించి తప్పు చేసిందన్నారు. తాను కనుక సీఎంగా ఉండివుంటే విడగొట్టిన జిల్లాలను మళ్లీ కలిపేసి వుండేవాడినని చెప్పారు. సమర్థుడైన చంద్రబాబు ఏపీకి మళ్లీ ముఖ్యమంత్రి కావడం సంతోషమన్నారు. చంద్రబాబు ముందు చాలా సవాళ్లు ఉన్నాయని, వాటిని కేంద్ర ప్రభుత్వ అండతో పరిష్కరించాలని సూచించారు. 
 
ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆయన కోరారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని ఘటనల్లో వాటి పర్యావసానమేనని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌ను తప్పిస్తేనే తెలుగు రాష్ట్రా మధ్య నదీ జలాల సమస్య పరిష్కారమవుతుందని కిరణ్ కుమార్ చెప్పారు. ఈ ట్రైబ్యునల్‌ తీర్పుపై తాను స్టే తీసుకొచ్చి 11 యేళ్లు అవుతుందని ఆయన గుర్తు చేశారు. నదీ జలాల విషయంలో అప్రమత్తం కాకుంటే రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.