శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2024 (11:35 IST)

వైకాపా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు టీడీపీ దూరం

tdp flag
ఉమ్మడి విశాఖపఖపట్టణం జిల్లాలో స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం కోసం జరుగనున్న ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో గెలవడం పెద్దకష్టం కాదని, అయినప్పటికీ హుందా రాజకీయాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. చంద్రబాబు నిర్ణయంపై టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలు కూడా హర్షం వ్యక్తం చేశారు. సీఎం అత్యంత హుందాగా వ్యవహరించారని కొనియాడారు. కాగా, ఉప ఎన్నిక నామినేషన్లు  గడువు ముగియనుంది. 
 
కాగా, ఈ ఉప ఎన్నికల్లో వైకాపా తపపున సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. అలాగే, ఈ ఎన్నికలో జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో 60 శాతానికి పైగా వైకాపా నుంచి గెలిచినవారే. అయినప్పటికీ పోటీని నిలిపితే గెలిపిస్తామంటూ టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు.. కూటమి నేతలు హామీ ఇచ్చారు. అయితే, అంత ప్రయాస అక్కర్లేదని, ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం అంతమందిని ప్రత్యర్థి పార్టీ నుంచి సమీకరించాల్సిన అవసరం లేదని, దానివల్ల వచ్చే ప్రయోజనం కూడా ఏమీలేదని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.