శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (15:40 IST)

భీమ్లా నాయక్ కాదు.. బిచ్చా నాయక్ : పవన్‌పై అనిల్ ఫైర్

anil kumar yadav
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తమకు దైవంతో సమానమని మంత్రిపదవిని కోల్పోయిన నెల్లూరు జిల్లా వైకాపా నేత అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పైగా, తాను మంత్రిగా ఉన్నందున గత మూడేళ్లుగా ప్రజలను కలుసుకోలేక పోయానని చెప్పారు. ఇకపై గడపగడపకు వెళ్ళే కార్యక్రమాన్ని మొదలుపెడతానని చెప్పారు. 
 
ఆయన మంగళవారం నెల్లూరులో విలేకరులతో మాట్లాడుతూ, మంత్రిగా ఉన్నందువల్ల మూడేళ్ల పాటు ప్రజలతో గడపలేకపోయానని... ఇప్పుడు రెండేళ్లు ప్రజలతో గడిపే అవకాశం వచ్చిందని అన్నారు. త్వరలోనే కార్యకర్తలతో సమావేశమవుతానని, గడప గడపకు వెళ్లే కార్యక్రమాన్ని మొదలు పెడతానని చెప్పారు. 
 
ముఖ్యమంత్రి జగన్ తమకు దైవంతో సమానమన్నారు. ఆయన వద్ద సైనికుడిగా పని చేయడమే తమకు గౌరవమన్నారు. మంత్రి పదవి లేకున్నా తాము తగ్గబోమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను మరోమారు గెలిపించి ముఖ్యమంత్రిని చేసి తాము మరోమారు మంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తామని తెలిపారు. 
 
మంత్రి పదవులు దక్కని అసంతృప్తి... తండ్రి మీద కొడుకు పడే అలక వంటిదని అన్నారు. రెండ్రోజుల్లో అంతా సర్దుకుంటుందన్నారు. ప్రమాణస్వీకారానికి మంత్రి కాకాని గోవర్ధన్ తనకు ఆహ్వానం పంపలేదని అన్నారు. 
 
తన నియోజకవర్గంలోకి కాకానిని ఆహ్వానిస్తానని చెప్పారు. వైసీపీ ఒక కుటుంబం వంటిదని... ఏవైనా గొడవలుంటే కూర్చొని మాట్లాడుకుంటామని అన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు కాకాని తనకు ఎంత గౌరవం ఇచ్చారో... ఇప్పుడు ఆయనకు అంతకంటే రెండు రెట్లు ఎక్కువ గౌరవం ఇస్తానని చెప్పారు.
 
అలాగే, జనసేనాని పవన్ కల్యాణ్‌పై అనిల్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయలేని పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ కాదని... టీడీపీ వద్ద బిచ్చం అడుక్కునే బిచ్చా నాయక్ అని ఎద్దేవా చేశారు. టీడీపీ వద్ద 35 నుంచి 40 సీట్లు బిచ్చం అడుక్కునే ఇలాంటి వ్యక్తి సీఎం ఎలా అవుతాడని ప్రశ్నించారు.