మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 19 డిశెంబరు 2018 (12:15 IST)

ఇక్కడ నుంచే దొంగనోట్లను ముద్రిస్తున్నారట.. ఎక్కడో తెలిస్తే షాకే..!

టెంపుల్ సిటీ తిరుపతి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. నగరంలో క్రైం రేటు విపరీతంగా పెరిగిపోతోంది. కొంతమంది అసాంఘిక వ్యక్తులు నగరంలోకి ప్రవేశించి ముఠాగా ఏర్పడి దొంగనోట్లను చలామణి చేసేస్తున్నారు. శ్రీవారి భక్తులే టార్గెట్‌గా దొంగ నోట్ల ముఠా రెచ్చిపోతోంది.  
 
ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశవ్యాప్తంగా తనదైన గుర్తింపు తెచ్చుకుంటోంది తిరుపతి నగరం. ఆధ్మాత్మికపరంగానే కాకుండా పలు రంగాల్లో అవార్డుల మీద అవార్డులు తిరుపతికి వస్తున్నాయి. ఇప్పటికే దేశంలోనే నేరాలు తక్కువగా నమోదయ్యే నగరంగా రెండవ స్థానం పొందిన తిరుపతి టాప్ టెన్ స్వచ్ఛ సిటీస్ లిస్టులోను చోటు సంపాదించింది. ఇలా అభివృద్థి పథంలో ముందుకు దూసుకుపోతున్న తిరుపతి పట్టణానికి ఈ మధ్యనే అనుకోని చిక్కొచ్చి పడింది. వరదలా వచ్చి పడుతున్న దొంగనోట్లను ఏ విధంగా అరికట్టాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు పోలీసులు. 
 
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అచ్చం అసలు నోటునే పోలేలా నకిలీ నోట్లను సృష్టిస్తూ చెలరేగిపోతున్నారు కేటుగాళ్ళు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు వాటిని ఇచ్చి భక్తులను మాయచేసి వాళ్ళకు అంటగట్టి పబ్బం గడుపుకుంటున్నారు. ఇందుకోసం రద్దీ ప్రదేశాలైన రైల్వేస్టేషన్, బస్టాండ్, హోటల్స్‌ను అడ్డాగా చేసుకుని తమ దందాను కొనసాగిస్తున్నారు. 
 
ఈ మధ్య కాలంలో పోలీసులకు పట్టుబడిన దొంగనోట్ల ముఠాకు సంబంధించి విచారణలో వెల్లడైన వాస్తవాలు నివ్వెరపోయేలా చేస్తున్నాయి. ఒకచోట, రెండుచోట్ల కాదు నగర వ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో పదుల సంఖ్యల్లో ముఠాలు తిష్ట వేసుకుని దొంగ నోట్ల ముఠాలు కూర్చున్నట్లుగా తెలియడంతో అవాక్కయ్యారు పోలీసులు. నకిలీ నోట్ల కేటుగాళ్ళను అరెస్టు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. 
 
పక్కా ప్రణాళితో డూప్లికేట్ నోటు కేటుగాళ్ళు చేస్తున్న మాయాజాలం తెలిస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. వీళ్ళకు ఒక  పద్థతి ప్రకారంగా నోట్ల తయారీ నుంచి మాటను మాయచేసి జనాలకు చేసే వరకు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళుతుంటారు. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్న రీతిలో ల్యాప్ ట్యాప్ లు, చిన్న పాటి ప్రింటర్లతోనే అచ్చం నిజమైన నోటును తలపించే నకిలీ నోట్లను సృష్టించేస్తున్నారు. అనంతరం ప్రణాళికాబద్ధంగా జనానికి అంటగట్టేస్తున్నారు. అయితే నకిలీ నోట్ల ముఠాకు నగరంలోని కొంతమంది హోటల్స్ ఇతర షాపుల వారు కూడా సహకరిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. 
 
తమ వద్దకు వచ్చే వినియోగదారుల తీరును బట్టి వారికి చాపకింద నీరులా నోట్లను ఇచ్చి పంపేస్తున్నారు. దీనికి గాను డూప్లికేట్ల ముఠాల నుంచి కమిషన్లు కూడా వారికి అందుతున్నట్లుగా తెలుస్తోంది. కొత్త నోట్లు కావడం, చాలామందికి అసలు, డూప్లికేట్ మధ్య వ్యత్యాసాలు పెద్దగా తెలియకపోవడం తదితర బలహీనతలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు నకిలీ నోట్ల మాయగాళ్లు. దీంతో పోలీసులు జనాన్ని అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతున్నారు. 
 
ముఖ్యంగా ఈ మధ్య కాలంలో విడుదలైన కొత్త నోట్లను సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. ఎవరికైనా ఎక్కడైనా నోట్లపై అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. మొత్తం మీద నేరాలను అదుపు చేస్తున్నామన్న సంతృప్తిలో ఉన్న తిరుపతి పోలీసులకు వచ్చి పడ్డ తాజా ఇబ్బంది ఎప్పుడు తీరుతుందో వేచి చూడాలి.