శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 19 డిశెంబరు 2018 (08:42 IST)

వాడి పాపాన వాడేపోతాడు... జగన్‌ను కలుస్తా : గంగుల భానుమతి

మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ నాంపల్లి సీఐడీ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. దీనిపై సూరి భార్య గంగుల భానుమతి స్పందించారు. భానుకిరణ్ డబ్బు కోసమే తన భర్తను హతమార్చాడని అన్నారు. కోట్ల రూపాయల సెటిల్‌మెంట్స్ చేశాడని చెప్పుకొచ్చారు. 
 
భానుకిరణ్ తన డబ్బును సినీ నిర్మాతల దగ్గర దాచుకుని ఉంటాడని అభిప్రాయపడింది. సూరి హత్యతో ఆయన వర్గీయులు ప్రతీకార కక్షతో ఉన్నారా? అనే ప్రశ్నకు భానుమతి సమాధానమిస్తూ, 'చెయ్యాలనుకుంటే ఎప్పుడో చెయ్యొచ్చు కానీ, అలాంటి ఆలోచన మాకు లేదు. వాడి పాపాన వాడే పోతాడు' అని వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, రాజకీయంగా తాను వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి వెంటే నడుస్తానని తెలిపారు. ఇందుకోసం ఆయన్ను త్వరలోనే కలువనున్నట్టు చెప్పింది. తనకేమీ పదవి కావాలని, టికెట్ కావాలని కోరుకోవడం లేదని, పార్టీ కోసం పాటుపడతానని చెప్పారు. 
 
తమ కుమారుడు హర్షవర్థన్ రెడ్డి చదువుకుంటున్నాడని, తాను మాత్రం రాజకీయ జీవితం గడుపుతానని ఆమె స్పష్టంచేశారు. తన ఊపిరి ఉన్నంత వరకూ ప్రజా సేవ చేసుకుంటూ ఉంటానని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ జీవితంలోకి తన కొడుకుని తీసుకునిరానని స్పష్టంచేశారు. 
 
అయితే, తన భర్త సూరి ఫ్యాక్షనిస్టు కాదని, పరిటాల రవి ఫ్యాక్షనిస్టని ఆమె ఆరోపించారు. సూరి ఎంతమందిని చంపారు? ఆయన ఎవరినీ చంపలేదని, అయినా 14 యేళ్ళ జైలు శిక్ష అనుభవించారని గుర్తుచేసుకున్నారు. పరిటాల రవి అయితే గిన్నిస్ బుక్ రికార్డుకు ఎక్కే స్థాయిలో హత్యలు చేయించాడని, వందల మందిని చంపారని ఆరోపించారు. తమది ఫ్యాక్షనిస్టుల కుటుంబం కాదని, పరిటాల రవిది మాత్రం అదే కుటుంబమని గంగుల భానుమతి ధ్వజమెత్తారు.