శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 ఏప్రియల్ 2021 (19:49 IST)

కాడెద్దు ఆరోగ్యం క్షీణించింది.. ఆ రైతు ఏం చేశాడంటే.. ఇద్దరు కుమారులను..?

Ox
కాడెద్దులను రైతులు సొంత పిల్లల్లా చూసుకుంటారు. వాటికి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. విలవిలలాడుతారు. ఆ రైతు కూడా అంతే. తన కాడెద్దుల్లో ఒక ఎద్దుకి అనారోగ్యం చేసింది. బండి లాగలేకపోయింది. అంతే.. ఆ ఎద్దుని పక్కకి తప్పించి, తన కొడుకులనే కాడెద్దులుగా మార్చేశాడు. అలా మూగజీవిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. కర్నూలు జిల్లాలో ఈ ఘటన జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. జిల్లపాడుకు చెందిన రాముడు రైతు. వ్యవసాయమే జీవనాధారం. ఆయనకు రెండు కాడెద్దులు ఉన్నాయి.  గ్రామంలో వ్యవసాయ పనులు లేకపోవడంతో ఎద్దుల బండిపై ఇసుక తరలించే పని ఒప్పుకున్నాడు. 
 
శుక్రవారం ఎద్దుల బండిలో నందికొట్కూరుకు ఇసుకను తరలించాడు. తిరిగి ఇంటికి పయనం అయ్యాడు. దారిలో ఓ ఎద్దు ఆరోగ్యం క్షీణించింది. ఉన్నచోటే ఉండిపోయింది. బండి లాగలేక ఆగిపోయింది. వెంటనే ఆ రైతు ఎద్దులను పక్కకి తప్పించాడు. ఇంటి దగ్గరున్న తన కొడుకులను పిలిపించాడు. వారిని కాడెద్దులుగా మార్చి బండిని లాగించాడు.
 
తాను ఎద్దులను తోలుకుని ఇంటికి వెళ్లాడు. అల్లూరు రహదారిలో ఈ దృశ్యం కనిపించింది. మూగజీవాలపై ఆ అన్నదాత చూపిన ప్రేమకు అంతా ఫిదా అవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ రైతుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.