గురువారం, 13 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2025 (08:50 IST)

ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు

vallabhaneni vasmi
వైకాపా నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలో ఆయనను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో దాడి కేసులో వల్లభనేని వంశీ ఓ నిందితుడుగా ఉన్న విషయం తెల్సిందే. గత కొంతకాలంగా పరారీలో ఉన్న ఆయనను హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో అరెస్టు చేశారు. 
 
రాయదుర్గంలోని మై హోం భుజాలో ఉండగా గుర్తించి అరెస్టు చేసారు. ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడకు తీసుకొస్తున్నట్టు సమాచారం. అయితే, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారా లేదంటే మరో కేసులోనా అనేది తెలియాల్సివుంది. 
 
గన్నవరం టీడీపీ కార్యాలయంలో గత 2023 ఫిబ్రవరి 20వ తేదీన దాడి జరిగింది. ఈ కేసులో వంశీ సహా 88 మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించాలంటూ కోర్టులో వంశీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 20వ తేదీన విచారణ జరుగనుంది. అంతలోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడం గమనార్హం.