శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 16 జూన్ 2020 (21:36 IST)

గిరిజన ప్రాంతాలకు శుభవార్త

రాష్ట్రంలో వెనుకబడిన గిరిజన ప్రాంతాలపై ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజా బడ్జెట్‌లో వరాల జల్లు కురిపించారు.

గిరిజన ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. వందల సంవత్సరాలుగా అడవుల్లో కొండల్లో నివసిస్తున్న గిరిజనులు సంక్షేమం కాయితాల్లో కనిపిస్తోందిగానీ.. వారి జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. వారి కష్టలను చూసిన వైఎస్‌ జగన్‌ సర్కార్.. గిరిజనం బతుకుల్లో వెలుగులు నింపాలని  గట్టి సంకల్పంతో ఉంది.

గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా, వైద్యం, ఆరోగ్యంపై బడ్జెట్‌లో ప్రత్యేక చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా 2020-21 బడ్జెట్‌లో గిరిజన అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, మౌలిక సదుపాయాలను మెరుగు పరచడం కోసం విశాఖపట్నం జిల్లా పాడేరులో వైఎస్సార్‌ వైద్య కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దీనితో పాటు సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, చింతూరు, కేఆర్‌పురం, శ్రీశైలంలో అదనంగా ఆరు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను కూడా నిర్మించాలని సంకల్పించింది. ఈ మేరకు తగిన నిధులను బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఇక ఉన్నత విద్యను గిరిజన విద్యార్థులకు మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి గిరిజన సంస్కృతికి, కళలు, ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన పరిశోధనలు చేయడానికి విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం నిర్మిస్తోంది.

ఈ మేరకు బడ్జెట్‌ సమావేశాల్లో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి  వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా గిరిజన తెగకు చెందిన నేతలు జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేగాక జీవో నంబరు 3 పై గిరిజనుల ప్రయోజనాలను రక్షించడానికి  అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ను కలిసి ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, గిరిజన శాససనభ్యులు విజ్ఞప్తి చేశారు.