బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 అక్టోబరు 2021 (08:22 IST)

బాలింత పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వలంటీరు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్లకు చెందిన గ్రామ వాలంటీరు ఓ బాలింత పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై ఆదివారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 22న వాలంటీరు మల్ల గోపి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో అతని భార్య ఇంట్లో ఉండటంతో భర్త ఫోన్‌ నంబరు కావాలని అడుగుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. 
 
ఆమె బయటకు పరుగు తీసి, ఇంటి పక్కనే ఉన్న మరో మహిళ ఫోన్‌ తీసుకొని విషయాన్ని భర్తకు చెప్పింది. దీనిపై బాధితురాలు మరుసటి రోజు శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా విచారించి ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కోటయ్య తెలిపారు.
 
బాలింత పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాలంటీరుపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారులతోపాటు మాచవరం స్టేషన్‌ ఎస్‌హెచ్‌వోతో ఆమె సోమవారం ఫోన్‌లో మాట్లాడి కేసు వివరాలు తెలుసుకున్నారు. 
 
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన వ్యవస్థకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించే ఏ స్థాయి ఉద్యోగినైనా క్షమించరాదన్నారు. విద్యార్థినులకు నీలిచిత్రాలు చూపుతూ అసభ్యకరంగా ప్రవర్తించిన సత్తెనపల్లి ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయుడి విషయంలో కఠినమైన చర్యలు చేపట్టాలన్నారు.