శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 13 నవంబరు 2021 (12:36 IST)

అకాల వ‌ర్షాల‌తో రైత‌న్న‌కు తీవ్ర న‌ష్టం... ఇపుడెలా భ‌గ‌వంతుడా?

కాలం కాని కాలంలో కురుస్తున్న భారీ వ‌ర్షాలు, చుట్టుముడుతున్న తుఫానులు అన్న‌దాత‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత వారంరోజులుగా కురుస్తున్న వర్షాలు తూర్పు గోదావరి జిల్లాలో తీవ్రనష్టాన్ని మిగిల్చాయి. జిల్లా ప్రధాన పంట‌ వరిపై వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. 

 
ఇప్పటికే ఖరీప్ కోత దశలో ఉండటంతో నష్టం ఎక్కువగా ఏర్పడింది. ప్రధానంగా జిల్లాలో 1.41 లక్షల హెక్టార్లలో వరి సేద్యం చేశారు. ఇందులో 4,394 హెక్టర్లలోని వరిపంట నేలనంటినట్లు ప్రాధమికంగా అంచనా వేసారు. ఇదికాక మరో 300 హెక్టర్లలోని పంట పనలపైన చేలల్లోనే ఉండిపోయింది. ఇక కళ్లాలలో 1,600  హెక్టర్లలోని పంట ఉండటంతో, రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. 

 
ప్రధానంగా డ్రైయినేజి వ్యవస్థ సక్రమంగా లేకపోవటంతో వరిచేలల్లోని ముంపు బయటకు మళ్లటంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా అమలాపురం, రాజమహేంద్రవరం రెండు డివిజన్లలోనూ నష్టం అధికంగా ఉందని అంచనా వేసారు. కాజులూరు, కె.గంగవరం, రామచంద్రాపురం ప్రాంతాలలోనూ అధికంగా వరి చేలు వర్షాలు, ఈదురు గాలులతో నేలనంటాయి. కోతకు రానున్న దశలో కురసిన వర్షాలు తూర్పుగోదావరి రైతులపై తవ్ర ప్రభావాన్నే చూపాయి. ఏటా ఖరీప్ లో తమకు కష్టాలు తప్పటంలేదని రైతులు వాపోతున్నారు. ఈ తుఫానుల న‌ష్టాన్ని ఎలా భ‌ర్తీ చేసుకోవాలి భ‌గ‌వంతుడా అని ఆకాశం వైపు ఆర్తిగా చూస్తున్నారు.