బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

అల్పపీడనంగా మారిన ఉపరితల ఆవర్తనం - కోస్తాకు భారీ వర్ష సూచన!!

rain
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ కారణంగా రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్రను ఆనుకుని పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అలాగే, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా తూర్పు పడమరగా ద్రోణి వ్యాపించింది. దీని ప్రభావంతో రుతుపవన ద్రోణి రాయపూర్, కళింగపట్నం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది. 
 
దీని ప్రభావంతో రాష్ట్రంలో నైరుతి రుతపవనాల్లో మరింత కదలిక ఏర్పడింది. సోమవారం కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం రెండు రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. 
 
రైతు బజార్లలో కేజీ కందిపప్పు రూ.160 విక్రయిస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్ 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని రైతు బజార్లలో కేజీ కందిపప్పును రూ.160కే విక్రయించనున్నట్టు వెల్లడించింది. ఈ విషయాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సోమవారం ఆయన విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కమిషనరేట్‌లో టోకు వర్తకులు, రైస్‌మిల్లర్లు, సరఫరాదారులతో నిత్యావసర ధరల పెరుగుదలపై సమావేశం నిర్వహించారు. ఇందులో ధరల స్థిరీకరణపై చర్చించారు. 
 
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో కందిపప్పు కిలో రూ.160 చొప్పున విక్రయించనున్నట్లు తెలిపారు. రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం పంపిణీ చేయడంపై చర్చించారు. ఈ నెల 11 నుంచి అన్ని రైతు బజార్లలోనూ నిర్ణయించిన రేట్ల ప్రకారమే సరకులు విక్రయించేందుకు వర్తకులు అంగీకరించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ సిద్దార్థజైన్, ఎండీ వీరపాండియన్‌ తదితరులు పాల్గొన్నారు.