శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 17 జూన్ 2024 (10:11 IST)

ఉత్తారంధ్రను ముంచెత్తనున్న వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

rain
నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా, మంగళవారం ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. పిడుగులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. 
 
సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో పిడుగులు పడడంతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని అంచనా వేస్తోంది. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశముందని తెలిపింది. ఉరుములతో కూడిన వానలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. 
 
కాగా, ఆదివారం కాకినాడ, ఏలూరు, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాత్రి 7 గంటల వరకు అత్యధికంగా కాకినాడలో 83 మిల్లీమీటర్లు, ఏలూరు జిల్లా నిడమూరులో 80.7 మి.మీ. వర్షపాతం నమోదైంది.