చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించిన జస్టిస్ జ్యోతిర్మయి
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారించేందుకు హైకోర్టు న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయి నిరాకరించారు.
ఈ పిటిషన్ దసరా సెలవుల ప్రత్యేక బెంచ్ (వెకేషన్ బెంచ్) ముందు శుక్రవారం విచారణకు రాగా.. 'నాట్ బిఫోర్ మీ' అంటూ న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ నుంచి తప్పుకొన్నారు. దీంతో ఈ పిటిషన్‌ను ఏ బెంచ్ విచారించాలనే అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు.
పిటిషన్ విచారణను చీఫ్ జస్టిస్ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు. చంద్రబాబు ఆరోగ్య కారణాల రీత్యా ప్రత్యామ్నాయ మార్గాలకు తన నిర్ణయం అడ్డురాదని జడ్జి తెలిపారు.
కాగా, ఈ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నెల 19న హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపి వెకేషన్ బెంచ్ ముందుకు వాయిదా వేసింది.