గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2020 (20:59 IST)

రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత: మంత్రి శంకరనారాయణ

రాష్ట్రంలో రోడ్ల పురోగతి, బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖా మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ చెప్పారు. స్థానిక ఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రోడ్ డవలప్‌మెంట్ కార్పోరేషన్ 29వ గవర్నింగ్ బాడీ సమావేశానికి మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రోడ్లు బలో పేతం చేసేందుకు ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన రెడ్డి అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి సూచనలతో రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఏపిఆర్ డిసి సమావేశంలో సమీక్షించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రోడ్లను అభివృద్ధి చేసే ధృక్పధం, ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు.

ఏపిఆర్ డిసి 1998 సంవత్సరంలో ఏర్పాటైందని అయితే 2014 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం రూ.3 వేల కోట్లు కార్పోరేషన్ ద్వారా అప్పు చేయించి ఆనిధులను తమకు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చే ఇతర కార్యక్రమాలకు మళ్లించారన్నారు. అప్పు చేసిన సొమ్ముకు ఈ రోజున నెలకు సుమారు రూ.250 కోట్లు వడ్డీ చెల్లించవలసి వస్తోందన్నారు.

ప్రస్తుతం ఈ భారం ప్రభుత్వం పై పడిందన్నారు. అంతేకాకుండా డిశంబరు నుండి అసలు, వడ్డీ వాయిదాలను కట్టవల్సిన పరిస్థితి ఉందన్నారు. ఆ రూ. 3 వేల కోట్ల రూపాయలు వివిధ వాణిజ్య బ్యాంకుల నుండి తీసుకున్న రుణం రోడ్ల అభివృద్ధికి ఉపయోగపడ లేదన్నారు. ఎన్నికల్లో లబ్ది పొందే ఆలోచనతో ఆనిధులు అప్పటి ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. 

త‌మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించడంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన రోడ్లు సౌకర్యం కల్పించాలనే ఆలోచనతో ఆంధ్ర ప్రదేశ్ రోడ్ డవలప్ మెంట్ కార్పోరేషన్‌ను మరింత మెరుగుపరిచడంతో పాటు మరిన్ని నిధులు కేటాయించి రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు.

రాష్ట్రంలో ఉన్న రోడ్లు గత 5 సంవత్సరాలుగా నిరాదరణకు గురైయ్యాయని ఆరహదారులను మెరుగుపరచడంతో పాటు క్రొత్త రోడ్లు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.

విజయవాడనగరంలో కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్, తదితర రూ. 15 వేల కోట్ల రూపాయలకు సంబంధించి విలువైన వాటికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఈనెల 4వ తేదీన జరగాల్సి ఉందని, అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి దివంగతులైన కారణంగా సంతాపదినాలు ప్రకటించినందున, ఈ కార్యక్రమాలు  8వ తేదీకి వాయిదావేయడం జరిగిందన్నారు.

కేంద్ర మంత్రి నితిన్ గడార్కి న్యూఢిల్లీ నుండి వర్చువల్ ద్వారా రూ.15 వేల కోట్ల విలువైన ఫ్లై ఓవర్లు, ఇతర రోడ్లకు సంబంధించిన ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తారన్నారు. తద్వారా కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్, బెంజిసర్కిల్ ఫ్లైఓవర్‌లను జాతికి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అంకితం చేస్తారన్నారు. తొలుత వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి 352 కిలోమీటర్ల మేర 13 రోడ్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై సమావేశంలో సమీక్షించారు.

రూ.1104 కోట్లతో సామర్లకోట-రాజానగరం, ఎ క్సటర్నల్ కనెక్టివిటి టూ నాయుడు పేట ఇండస్ట్రియల్ క్లస్టర్, కనెక్టవిటి టూ రౌతు సురమాల క్లస్టర్, ఎ క్సటర్నల్ కనెక్టవిటి టూ నక్కపల్లి క్లస్టర్, అనకాపల్లి-అచ్యుతాపల్లి రోడ్లకు సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి అంశాలపై సమీక్షించారు.

స‌మావేశంలో రాష్ట్ర ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరి యంటి.కృష్ణబాబు, ఏపిఆర్‌డిసి మేనేజింగ్ డైరెక్టరు, స్టేట్ హైవేస్ (ఆర్ అండ్ బి) చీఫ్ ఇంజినీరు పి.సి.రమేష్‌కుమార్, యండిఆర్ బిల్డింగ్స్ (ఆర్ అండ్ బి) చీఫ్ ఇంజినీరు కె.నయిముల్లా, తదితరులు పాల్గొన్నారు.