శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2020 (20:50 IST)

ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ షార్ట్ ఫిల్మ్‌ల పోటీలు

మద్యం వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, రాష్ట్రంలో దశలవారీ మద్యం నిషేధంతో కలుగుతున్న సత్ఫలితాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్‌ల పోటీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సచివాలయంలోని పబ్లిసిటీలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. మద్యం వినియోగం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డునపడుతున్నాయన్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకునే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దశలవారీగా మద్యపాన నిషేధానికి శ్రీకారం చుట్టారన్నారు. దీనిలో భాగంగా బెల్టు దుకాణాల పూర్తిస్థాయిలో తొలగింపు, పర్మిట్ రూమ్ రద్దు, మద్యం దుకాణాలు తగ్గింపు, మద్యం విక్రయాల వేళల నియంత్రణ, ధరల పెంపు వంటి విప్లవాత్మక చర్యలను సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టారన్నారు.

రాష్ట్రంలో మద్య నియంత్రణకు తీసుకున్న నిర్ణయాలతో వస్తున్న సత్ఫలితాలను తెలియజెప్పే విధంగా షార్ట్ ఫిల్ములు ఉండాలన్నారు. ‘మద్యం మహమ్మారి దుష్ప్రభావాలు – ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న దశలవారీ మద్యనిషేధం‘ అనే టాపిక్ పై షార్ట్ ఫిల్మ్ లు రూపొందించాలన్నారు. మద్య నిషేధం వల్ల ఏపీలో అక్కా చెల్లెమ్మల కళ్లల్లో ఆనందం వెల్లివిరియడం, వారి కుటుంబాలు కళకళలాడుతుండే అంశాలు ప్రతిబింభించేలా ఆ షార్ట్ ఫిల్మ్ లు ఉండాలన్నారు. 

షార్ట్ ఫిల్మ్ నిడివి 5 నుంచి 10 నిమిషాల పాటు తెలుగు భాషలో ఉండాలన్నారు. పోటీల్లో పాల్గొన్న వాటిలో నుంచి ఉత్తమ 15 షార్ట్ ఫిల్మ్ లు ఎంపిక చేస్తామని చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. వాటిని ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా షార్ట్ ఫిల్మ్ లను ఎంపిక చేస్తామన్నారు.

ప్రథమ బహుమతిగా 5 షార్ట్ ఫిల్మ్ లకు రూ.10 వేలు చొప్పున్న, ఒక్కో ద్వితీయ విజేతకు రూ.7,500ల నగదు, తృతీయ విజేతలకు రూ.5 వేల చొప్పున నగదు అందజేయనున్న‌ట్లు తెలిపారు. ఉత్తమ దర్శకుడికి రూ.5 వేలు, ఉత్తమ రచనకు రూ.5 వేలు, ఉత్తమ నటుడు (లేదా) నటికి రూ.5 వేల నగదు అందజేయనున్నామన్నారు.

దీంతో పాటు ప్రభుత్వ ప్రశంసా పత్రం, జ్ఞాపిక కూడా అందజేసి సత్కరిస్తామన్నారు. షార్ట్ ఫిల్మ్ లు పంపాల్సిన ఆఖరు తేదీ  సెప్టెంబర్ 25వ తేదీ అని, విజేతల వివరాలు అదే నెల 28వ తేదీన ప్రకటిస్తామని తెలిపారు. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా విజేతలకు బహుమతుల ప్రదానం చేస్తామన్నారు.

ఎంట్రీ ఫీజు ఉచితమని, షార్ట్ ఫిల్మ్ లను [email protected] మెయిల్ కు పంపాలన్నారు. మరిన్ని వివరాలకు 8790005577, 9381243599 ఫోన్ నెంబర్లలో సంపద్రించాలని ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి కోరారు.