శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2020 (20:43 IST)

వైసీపీకి ఓటేసినందుకు ప్రజలు బాధపడుతున్నారు: టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి

15నెలల వైసీపీ పాలన చూశాక ఈ ప్రభుత్వానికా మనం ఓటేసిందని ప్రజలు బాధపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి చెప్పారు. ఆయన తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఈప్రభుత్వ గుండె చప్పుడు ఒక్కసారి ప్రజలువింటే కక్ష, దౌర్జన్యం, దోపిడీ అనే వినిపిస్తుందన్నారు.

ప్రజాస్వామ్యానికి కీలకమైన నాలుగుస్థంభాల్లో  రాష్ట్రపాలకులు ఇప్పటికే మూడుస్థంభాలను కూల్చేసి, నాలుగో దాన్ని పడగొట్టడానికి ఉవ్విళ్లూరుతున్నారని దీపక్ రెడ్డి స్పష్టం చేశారు.  లెజిస్లేచర్ వ్యవస్థకు మూలమైన అసెంబ్లీ, మండలిని ఏ విధంగా తమసొంతానికి వాడుకున్నారో, ప్రతిపక్షసభ్యులను బలవంతంగా బయటకు గెంటేసిన సందర్భాలను చూశామన్నారు.

తమ ప్రభుత్వం పంపే ప్రతి బిల్లుని శాసనమండలి ఆమోదించడం లేదన్న కక్షతో దాన్నే రద్దుచేయడానికి ప్రభుత్వం పూనుకుం దన్నారు.  ఎస్సీవర్గీకరణ బిల్లు, ఇంగ్లీష్ మీడియం బిల్లులకు సవరణలు సూచిస్తే, టీడీపీసభ్యులపై కక్షకట్టారన్నారు. మండలి ఛైర్మన్ ను మంత్రులే అనరాని మాటలనడం దారుణమని దీపక్ రెడ్డి వాపోయారు.

మండలితో తమకు పనిలేదు, అసెంబ్లీలో మేథావులున్నారని చెప్పినప్రభుత్వం, ఎమ్మెల్సీలకన్నా ఎక్కువగా ఎందుకుసలహాదారులను నియమించుకుందో చెప్పాలన్నారు.  ఎల్వీ సుబ్రహ్మణ్యంపై కక్షకట్టి, ఆయన్ను తక్కువస్థాయి పోస్ట్ కు బదిలీచేయడం ద్వారా ఎగ్జిక్యూటివ్ వ్యవస్థను ప్రభుత్వం ఎంత దారుణంగా భయపెట్టిందో అర్థమవుతోందన్నారు. ప్రశ్నించే అధికారులను, సస్పెన్షన్లు, విచారణలపేరుతో పాలకులు భయపెట్టింది నిజం కాదా అని ఎమ్మెల్సీ ప్రశ్నించారు.

దానివల్ల ఉద్యోగులందరినీ చెప్పుచేతల్లో పెట్టుకున్న ప్రభుత్వం, వారితోనే తప్పుడు పనులు చేయిస్తున్నారన్నారు. 
జీవోనెం-2430ద్వారా మీడియాపై కత్తికట్టిన జగన్ ప్రభుత్వం, విలేకరులు హత్యకు గురవుతున్నా, వారిపైఅ అధికారపార్టీవారే దాడులు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో తొలిసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలను చిత్రీకరించారన్న అక్కసుతో ఒక టీవీఛానెల్ విలేకరిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారన్నారు.

టీవీ5 యాజమాన్యాన్ని, యాంకర్ మూర్తిని ఎన్ని రకాలుగా వేధించారో అందరం చూశామన్నారు. తమకు అనుకూలంగా లేని మీడియాకు ప్రకటనలు ఇవ్వకుండా నిలిపేసిన ప్రభుత్వం, సాక్షి మీడియాకు మాత్రాం 52శాతం ప్రకటనలు ఇచ్చుకుంటోందని దీపక్ రెడ్డి చెప్పారు. 

ఈ విధంగా మూడుస్థంభాలను కూల్చేసిన ప్రభుత్వం, అంతిమంగా అతిముఖ్యమైన న్యాయవ్యవస్థను కూడా తమ అదుపాజ్ఞల్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఆగస్ట్ 26వరకు చూస్తే, ఈప్రభుత్వానికి కోర్టులు 84సార్లు మొట్టికాయలు వేశాయన్నారు.

కోర్టులు, న్యాయమూర్తులను తప్పుపడుతూ ఎంపీ విజయసాయి రెడ్డి, స్పీకర్ తమ్మినేని, వైసీపీఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పలుసందర్భాల్లో న్యాయస్థానాలను, న్యాయమూర్తులను దూషించిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు.

సోషల్ మీడియాలో కొందరు వైసీపీవారు, జడ్జీలను తీసుకెళ్లి కోవిడ్ కేంద్రాల్లో పడేయాలని, జడ్జీలంతా టీడీపీ ఏజెంట్లని, వారంతా స్లీపర్ సెల్స్ అని రకరకాలవ్యాఖ్యానాలు చేసినవారిపై చర్యలు తీసుకోకుండా, వారినిమరింత ప్రోత్సహించేలా ప్రభుత్వం వ్యవహరిం చిందన్నారు.  వైసీపీ పోస్టింగులను చూసి, సదరువ్యక్తులపైచర్యలు తీసుకోవాలని హైకోర్టు చెప్పినా ప్రభుత్వంలోస్పందన లేదన్నారు.

చివరకుఎలాగైనా జడ్జీలను తమదారికి తెచ్చుకోవాలన్న దురుద్దేశంతో , ఉన్న వైసీపీపాలకులు ఫోన్ ట్యాపింగ్ ను తెరపైకి తెచ్చారన్నారు. జే.సీ. ప్రభాకర్ రెడ్డి విషయంలో రెండు తీర్పులు ఆయనకు అనుకూలంగా వచ్చినా, సదరుఅధికారులపై ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. ఆయనపై పెట్టిన కేసుల్లో తప్పుడు సెక్షన్లుపెట్టారని, వాటిని కూడా కొన్నిసందర్భాల్లో జడ్జీలు పట్టించుకోలేదన్నారు.

40కేసుల్లో జే.సీ.ప్రభాకర్ రెడ్డికి బెయిల్ వస్తే, కేవలం ఒక్క కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చినా కిందికోర్టు తిరస్కరించడం జరిగిందన్నారు. జే.సీ. ప్రభాకర్ రెడ్డి వ్యవహారంలో కూడా కోర్టులను ప్రభుత్వం దారి మళ్లించినట్లుగా ఉందన్నారు. ప్రభాకర్ రెడ్డిని మూడుజైళ్లకు మార్చేలా కిందికోర్టు ఎందుకు పదేపదే మార్చి ఆదేశాలు ఇచ్చిందన్నారు.

అరెస్టయినప్పుడు ప్రభాకర్ రెడ్డికి కోవిడ్ లేదని, పోలీస్ కస్టడీలో ఆయనకు  పాజిటివ్ వస్తే, అందుకుబాధ్యులైన జిల్లా ఎస్పీ, ఇతర పోలీస్అధికారులపై ఇప్పటివరకు చర్యలులేవన్నారు. న్యాయవ్యవస్థనుకూడా వేధింపు లకు గురిచేసి, తద్వారా జడ్జీలను లొంగదీసుకోవాలని  ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. తనపై సోషల్ మీడియాలో అసభ్యంగా కామెంట్లు పెడుతున్న వారిపై అనేకసార్లు ఫిర్యాదుచేసినా ఎవరూ పట్టించుకోలేదన్నారు.

టీడీపీవారిపై ఇష్టానుసారం తప్పుడు కేసులు నమోదుచేస్తున్న పోలీసులు, వైసీపీ వారు ఏం చేసినా ఒక్క కేసుకూడా పెట్టడం లేదన్నారు. ఎమ్మెల్సీగా తనకు ప్రభుత్వం తరుపున పీఏని నియమించాలని కోరినా కలెక్టర్లు పట్టించుకోలే దన్నారు.  ఈ విధంగా అనేకఅంశాల్లో పోలీసుల, అధికారులు తమ విధులకు విరుద్ధంగా, ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారన్నారు. 

వైసీపీ ప్రభుత్వంలో కలెక్టర్లు  కూడా పనికిమాలిన వాళ్లలా తయారయ్యారని, శాంతిభద్రతలు పూర్తిగా నాశనమయ్యా యన్నారు. పోలీస్ స్టేషన్ కు వెళితే, పేదవాడికి  న్యాయం జరగడ లేదని, మహిళలకు అసలు రక్షణే లేకుండా పోయిందన్నారు. రోజుకి మూడురేప్ లు, నెలకు 98ఆకృత్యాలు వైసీపీ ప్రభుత్వంలో జరుగతున్నాయన్నారు. రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగం వైసీపీ నేతల సెక్యూరిటీ వ్యవస్థగా మారిందని దీపక్ రెడ్డి ఎద్దేవాచేశారు. 

టీడీపీ ప్రభుత్వంలో చేసిన ఎన్ ఆర్ ఈజీఎస్ పనులకు ఇంతవరకు బిల్లులు చెల్లించలేదన్నారు. తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు మాత్రం కోట్లకు కోట్లు దోచిపెడుతున్నారన్నారు. 15నెలల్లో ఒక్కసారి కూడా ఈప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించలే దన్నారు. అసైన్డ్ , ముంపు భూములను ఇళ్లపట్టాల పేరుతో కబ్జా చేశారని, కరోనాపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా రాష్ట్రాన్ని దేశంలోనే రెండోస్థానంలో నిలిపారన్నారు.

పొరుగురాష్ట్రంతో ఉన్న వివాదాలు పరిష్కారం కాకుండానే, రాష్ట్రానికి చెందిన లక్షా30వేలకోట్ల ఆస్తులను ఈ చేతగాని ప్రభుత్వం తెలంగాణకు అప్పగించిందన్నారు. కేంద్రం మెడలు వంచైనా సరే, ప్రత్యేకహోదా తెస్తామన్న పాలకులు, తిరుపతిలో మోదీ కాళ్లుపట్టుకున్నారని దీపక్ రెడ్డి మండిపడ్డారు. పార్లమెంట్ లో ప్రతి బిల్లుకు మద్ధతు తెలిపి, లోపాయికారీగా కేంద్రంతో లాలూచీపడింది వైసీపీ ప్రభుత్వం కాదా అని ఆయన ప్రశ్నించారు.

ఈ విధంగా అనేక అంశాల్లో రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన ఈ ప్రభుత్వానికి ఓటేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. రాష్ట్రప్రజలు ఇప్పటికైనా వైసీపీ పాలనపై ఆలోచన చేసి, మేల్కోకుంటే, భావితరాలు ప్రమాదంలో పడతాయని టీడీపీ ఎమ్మెల్సీ హెచ్చరించారు.