శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2020 (21:15 IST)

వైసీపీ రంగులేసిన స్కూలు బ్యాగులు, యూనిఫామ్ కోసమే పాఠశాలలా?: అనిత

ముఖ్యమంత్రి ఇప్పటికే తనతుగ్లక్ చర్యలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని, కరోనా వైరస్ రాష్ట్రంలో రోజురోజుకీ విజృంభిస్తున్న తరుణంలో పాఠశాలలు తెరవాలనే ప్రభుత్వ నిర్ణయం  ఆయన తుగ్లక్ చర్యలను పతాకస్థాయికి చేర్చిందని టీడీపీ మహిళానేత, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవాచేశారు.

మంగళవారం ఆమె తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా బారిన పడిమరణించిన వారి సంఖ్య 4వేలకు చేరుతోందని, కేసులేమో 4లక్షలకు చేరాయని, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కరోనావ్యాప్తి అధికంగా ఉందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ప్రచారపిచ్చితో పసివాళ్ల  ప్రాణాలతో చెలగాటమాడటానికి పూనుకోవడం సిగ్గుచేటని అనిత ఆగ్రహం వ్యక్తంచేశారు.

కరోనా కేసుల్లో దేశంలోనే  ఏపీ మూడో స్థానంలో ఉందని, ఇందుకు కారణం జగన్మోహన్ రెడ్డి చేతగాని తనం కాదా అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం టెస్టింగులు అధికంగా చేస్తోంది కాబట్టే, కేసులు పెరుగుతున్నాయంటున్న మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేల తెలివితక్కువ తనాన్ని చూసి ప్రజలంతా నవ్వుకుంటు న్నారన్నారు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉండబట్టే, కేసులు పెరుగుతున్నాయనే నిజాన్ని వారు తెలుసుకుంటే మంచిదన్నారు. 

రోజుకి దాదాపు 10వేలమంది కరోనా బారినపడుతుంటే, ప్రజలకు సందేశాలిచ్చే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు మాస్కులు లేకుండా తిరగడమేమిటని అనిత ప్రశ్నించారు.

ప్రజల గురించి పట్టించుకోకుండా, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా  వ్యవహరించి, కరోనావ్యాప్తికి కారకులయ్యారన్నారు. పెద్దపెద్దవాళ్లే ఇళ్లలోనుంచి బయటకు రాకుండా, ఉన్నంతలో తింటూ, జీవనం సాగిస్తుంటే, పేదలు, సామాన్యులు వారిపిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోకుండా, పాఠశాలలు తెరవాలనుకోవడం ఏమిటని అనిత ప్రభుత్వాన్ని నిలదీశారు.

ప్రభుత్వానికి ఉన్న ప్రచార పిచ్చి ఏస్థాయిలో ఉందో ప్రజలు అర్థంచేసుకోవాలని, ఆ పిచ్చితోనే పిల్లల దుస్తులు, బ్యాగులకు కూడా పార్టీ రంగులేసిందన్నారు. విద్యాశాఖ మంత్రి ఒకవైపు కరోనాతో బాధపడుతూ, సెప్టెంబర్5న  పాఠశాలలు తెరుస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. 

ప్రభుత్వపాఠశాలలన్నీ గ్రామీణ ప్రాంతాల్లోనే అధికమని, అక్కడ చదివేపిల్లలు కూడా పేద, మధ్యతరగతి వర్గాల వారేనని, వారికి మాస్కులు పెట్టుకోవడం, సామాజికదూరం పాటించడం ఎలా వస్తాయో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. పార్టీ రంగులేసిన వస్తువులు ఇవ్వడానికి, పసివాళ్లను బలిచేయాలను కోవడం ఈ దుర్మార్గపు ప్రభుత్వానికే దక్కిందన్నారు. తుగ్లక్ ను మించిన  బుర్రలకే ఇటువంటి ఆలోచనలు వస్తాయన్నారు. 

విద్యార్థినీ, విద్యార్థుల తల్లులకు కడుపుకోత మిగిల్చే బదులు, ఆన్ లైన్లో తరగతులు నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు రావడం లేదని అనిత ప్రశ్నించారు. విద్యార్థులకు సెల్ ఫోన్లు పంపిణీ చేసి, ఆన్ లైన్లో బోధన చేస్తే, అందరికీ మంచిదని ఆమె హితవుపలికారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖా మంత్రి తమ నిర్ణయంపై పునరాలోచన చేయాలన్నారు.

అంతగా తమ పార్టీ రంగులేసిన యూనిఫామ్, స్కూలు బ్యాగులు పంచాలనే ఉబలాటం పాలకులకు ఉంటే, ప్రభుత్వసొమ్ముతో బతికే వాలంటీర్ల ద్వారా వాటిని ఇంటింటికీ పంపిణీ చేస్తే మంచిదన్నారు. దేశవిదేశాల్లో మెప్పుపొందిన వాలంటీర్ల వ్యవస్థను వినియోగించుకో వాలనే ఆలోచన పాలకులు ఎందుకు చేయరన్నారు.

విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ఏంచేయాలో ప్రభుత్వం ఆలోచించాలని, ఉపాధ్యాయులు, విద్యారంగ నిపుణులు, మేథావులు, ప్రజల అభిప్రాయాలు తీసుకొని, పిల్లలకు ఇబ్బంది లేకుండా చేయాలని, కరోనాకు వ్యాక్సిన్ వచ్చేవరకు ఇటువంటి తలతిక్కపనులు మానుకోవాలని అనిత ప్రభుత్వానికి సూచించారు. 

ఆన్ లైన్ విద్యావిధానం పేరుతో ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు చేసే దందాలను కూడా ప్రభుత్వం కట్టడి చేయాలన్నారు. తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి ప్రజల్లోకి వస్తే, ఆయనకు బయట ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు.