బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 3 జూన్ 2020 (19:56 IST)

ఆర్థిక ఇబ్బందులున్నవారు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించండి: జస్టిస్ కాంతారావు

ఏపీలోని పాఠశాలలు, విద్యాశాఖకు సంబంధించిన వివిధ అంశాలపై వివరాలు తెలుసుకునేందుకు నోటిఫికేషన్‌ను జారీ చేశామని. వాటిపై కొన్ని యాజమాన్యాలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర పాఠశాల విద్యా పర్యవేక్షణ, వియంత్రణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్. కాంతారావు పేర్కొన్నారు.

బుధవారం పటమటలోని జిల్లా ప్రజా పరిషత్ హైస్కూలు ప్రాంగణంలో వైస్ చైర్‌పర్సన్ డాక్ట‌ర్ విజయశారదా రెడ్డి, కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డితో కలిసి ఆయన విలేక‌రుల సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జస్టిస్ ఆర్.కాంతారావు మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్వహించే పాఠశాలలు, విద్యాసంస్థల సమాచారాన్ని తెలుసుకునే హక్కు పాఠశాల విద్యా పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌కు ఉందన్నారు.

ఈ విషయమై సమాచారాన్ని కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసామని ఈ విషయమై కొందరు కోర్టులకు వెళ్లడమే కాకుండా యాజమాన్యాల నుంచి కొంత మొత్తం డబ్బులు కూడా వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు పాఠశాల పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌పై కొందరు అసత్య ప్రచారాన్ని చేస్తున్నారని, అన్ని పాఠశాలలు, విద్యా సంస్థల ఆర్థిక పరిస్థితి ఒకేలా ఉండే స్థితిగతులు ఉండవన్నారు.

ఆయా పాఠశాలలు నిర్వహణకు సంబంధించి విద్యార్థులు, తరగతి గదులు, టీచర్లు, తదితర మౌలిక సంబంధ పరమైన వివరాలను కోరడం జరిగిందన్నారు. వాటిని కమిషన్ కోరిన నేపథ్యంలో కొందరు కోర్టును ఆశ్రయించిన వారికి హక్కు ఉందని, అదే సమయంలో కమిషన్‌ను అడిగిన సమాచారం అనవసరమైన అపోహలను కల్పిస్తున్నారన్నారు.

కమిషన్ ఎప్పుడూ పర్యవేక్షణను, నియంత్రణను చేపట్టడం ద్వారా పిల్లలకు ఉత్తమమైన విద్యను అందించే దిశలోనే చర్యలు ఉంటాయని, ఎవరిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం లేదని జస్టిస్ శాంతారావు తెలిపారు. 

రాష్ట్రంలో ప్రాథమిక విద్యా దశ నుండి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను కోర్టు నిలుపుదల చేసిందన్నారు. ప్రస్తుతం 97 శాతం మంది తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమం పట్ల ఆసక్తి చూపారన్నారు.

ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విద్యా విధానంలో మార్పు తేవడానికి కృషి చేస్తున్నారన్నారు. సంస్కరణలను చేసే తొలి దశలో విమర్శలు, అడ్డంకులు రావడం సహజమే, విద్య ద్వారానే సమసమాజ స్థాపన జరుగుతుందన్నది వాస్తవ‌మ‌న్నారు.

వాలంటీర్లు తల్లిదండ్రులు నుండి బలవంతంగా ఆంగ్ల మాధ్యమం ఒప్పించారని కొన్ని మీడియా సంస్థలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఫీజు చెల్లించాలంటూ పాఠశాల యాజమాన్యాలు మెసేజ్ పంపిస్తూ ఫీజుల కోసం ఒత్తిడి తేవడం మంచిది కాదన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో ఫీజు చెల్లించని తల్లిదండ్రులు 9వ తరగతి లోపు విద్యార్థులను కనీసం రెండు సంవత్సరాల పాటైనా ప్రభుత్వ పాఠశాలల్లో చదివించి పరిశీలన చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో నాణ్యతాపరమైన విద్యను బోధించేందుకు చర్యలు తీసుకుంటున్నదన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అర్హత కలిగిన ఉపాధ్యాయులు ద్వారా బోధన జరుగుతుంది, మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారాన్ని కూడా అందించడం, జగనన్న కానుక క్రింద యూనిఫారం, బూట్లు, పుస్తకాలు వంటివి ఉచితంగా అందిస్తున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని అవి స్వాగతించే విధంగా ఉన్నాయన్నారు. ప్రతీ విద్యార్థికీ నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తున్నదన్నారు.

విద్య అనేది వ్యాపారం కాదని అది ఒక సామాజిక బాధ్యతగా చేపట్టాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేందుకు పాఠశాల తరగతి గదులుకు మించిన ప్రదేశం మరొకటి లేదని ఆయన తెలిపారు.

డిజిటల్ విధానంలో విద్య భోధన అందించే వనరులు పేద, నిరుపేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు అందుబాటులో లేదని, దానివలన ఒత్తిడికి గుర‌వుతారు. అదే సమయంలో సెల్‌ఫోన్ ద్వారా కూడా నేర్చుకోవడం కూడా కష్టసాధ్యం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రాధమిక విద్య పాఠశాల తరగతి గదుల నుండే నేర్చుకోవాలన్నారు. 

రాష్ట్ర పాఠశాల విద్యా పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ వైస్ చైర్ పర్సన్ విజయ శారదారెడ్డి, కార్యదర్శి ఆలూరు సాంబశివరెడ్డి మాట్లాడుతూ కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆయా పాఠశాలల యొక్క పూర్తి వివరాలు సేకరించి వాటి యొక్క ప్రామాణికతను అంతర్జాలం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు అందుబాటులో ఉంచుతామన్నారు.

అదే సమయంలో అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, ఫీజులు, ఉపాధ్యాయులు వివరాలు పూర్తి సమాచారం ఉండడం వలన వారి పిల్లలకు తగిన స్కూల్‌కు ఎంపిక చేసుకునే సౌలభ్యం కలుగుతుందన్నారు. వృత్తి విద్యా కోర్సులు, ఉన్నత విద్యా కోర్సు నేర్చుకునేందుకు ఆంగ్ల మాధ్యమం కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదన్నారు.

దేశంలో అమ్మబడి వంటి కార్యక్రమాన్ని అమలు చేస్తున్న రాష్ట్రం మరొకటి లేదన్నారు. పేద, గొప్ప మధ్య వ్యత్యాసం లేకుండా అందరికీ నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని తెలిపారు.