బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం

ఆర్ధిక ఇబ్బందుల్లో ఆర్టీసీ కార్మికులు

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతూనే ఉంది. 40 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె స్తున్నా,ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వ వైఖరి మాత్రం పట్టింపులేనట్టు గానే ఉంది.

ఇక ఆర్టీసీ కార్మికుల పక్షాన హైకోర్టు తీర్పు చెబుతుందని భావించిన ఆర్టీసీ కార్మికులు ముగ్గురు సుప్రీం మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని చెప్పి చేసిన ప్రకటనతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
 
సెప్టెంబర్ నెల నుండి జీతాలు లేని కార్మికులు
ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాన్ని చర్చలు జరపాలని హైకోర్టు సూచించినప్పటికీ, సీఎం కేసీఆర్ హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేశారు.

ఇక అలాంటి సమయంలో మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తే, ఆ కమిటీ సూచనలు సీఎం కేసీఆర్ వింటారా అన్నది ఆర్టీసీ కార్మికుల లో ఉన్న పెద్ద ప్రశ్న.ఇక ఈ విషయం అలా ఉంటే ఆర్టీసీ కార్మికులు దసరా ముందు నుండి ఆందోళన బాట పట్టారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబరు నెల నుండి జీతాలను నిలుపుదల చేసింది.
 
తిండి లేని స్థితిలో కార్మిక కుటుంబాలు
ఇప్పటివరకు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం నవంబరు నెల నడుస్తున్నప్పటికీ ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు పరిష్కారమే కనిపించకుండా పోయింది. ఆర్టీసీ కార్మికుల ఆవేదన అరణ్య రోదనగా మారింది.

ఇక జీతం మీద ఆధారపడిన ఆర్టీసీ కార్మిక కుటుంబాలు తినడానికి తిండి కూడా లేక పస్తులు ఉంటున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో ఓ ఆర్టీసీ కండక్టర్ ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో కులవృత్తిని ఆయుధంగా ఎంచుకున్నాడు.
కత్తెర చేతబట్టి కులవృత్తిని ఎంచుకున్న ఓ కండక్టర్
 
నిన్నటి వరకు ఆర్టీసీ బస్సుల్లో టికెట్ టికెట్ అంటూ టికెట్లు పంచ్ కొట్టిన కండక్టర్ కత్తెర చేత బట్టాడు. కుటుంబ పోషణ కోసం సెలూన్ ను నిర్వహిస్తూ, మరోపక్క ఆర్టీసీ కార్మిక ఉద్యమంలో పాలుపంచుకుంటున్నాడు.

నిర్మల్ రూరల్ మండలం రత్నాపూర్ కాలనీకి చెందిన మహిపాల్ గతంలో సెలూన్ ను నిర్వహించేవాడు. 2009లో ఆయనకు ఆర్టీసీ ఉద్యోగం వచ్చిన తర్వాత కులవృత్తిని పక్కనపెట్టి ఇంతకాలం ఆర్టీసీలో విధులు నిర్వర్తించాడు.
 
కుటుంబ పోషణకు సెలూన్ నిర్వహణ... కూలీనాలీ చేస్తున్న కార్మికులు
ఇక తాజాగా ఆర్టీసీ సమ్మెతో, సమ్మెలో పాల్గొంటున్న ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు తొలగించినట్లు ప్రభుత్వం ప్రకటించడంతో కుటుంబ పోషణ భారం కాగా మరోమారు కత్తెర చేత బట్టాడు మహిపాల్.

ఒకపక్క కులవృత్తిని నిర్వహిస్తూనే, మరోపక్క ఆర్టీసీ కార్మికుల ఉద్యమంలో పాలుపంచుకుంటున్నాడు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా జీతాలు రాక, ఆర్ధిక ఇబ్బందులు తాళలేక చాలా మంది ఆర్టీసీ కార్మికులు కుటుంబాలను పస్తులు పెట్టలేక కూలినాలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీస్తూనే, ఆర్టీసీ పోరులో భాగస్వాములవుతున్నారు.

ఆర్టీసీ కార్మికులు ఇంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటూ కూడా ప్రభుత్వంపై పోరాటం చేయడం వారి సమస్యల తీవ్రతకు అద్దం పడుతోంది.