2019లో అవన్నీ చేస్తాం అంటున్న ఏపీ సీఎస్
సాధించిన విజయాలతో సంతృప్తి చెందకుండా నూతన సంవత్సరంలో మరిన్ని పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాధికార సంస్ధ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్ధ నిర్వహణ సంచాలకులు హిమాన్హు శుక్లా తెలిపారు. 2019 క్యాలెండర్ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలను అలరించేందుకు మరిన్ని పర్యాటక ఆకర్షణలు సిద్దం చేస్తున్నామన్నారు. నంవబర్లో చేపట్టిన ఎఫ్1హెచ్2ఓ దేశంలోనే అతిపెద్ద ఈవెంట్‌గా నిలవగా ఆ పరంపరను కొనసాగిస్తామని, 2019 నవంబరులో వారంరోజుల పాటు జల ఉత్సవాలు నిర్వహించనున్నామన్నారు.
ఎఫ్1హెచ్2ఓతో పాటు, అక్వాబైక్ రేసింగ్, పారా సైలింగ్ కార్యక్రమాలు ఉంటాయన్నారు. 2018 సంవత్సర ముగింపు నేపధ్యంలో 2019లో చేపట్టనున్న కార్యక్రమాల గురించి తనను కలిసిన మీడియా ప్రతినిధులకు సోమవారం వివరించారు. సంక్రాంతి పర్వదినాల తరువాత, 17,18,19 తేదీలలో అరకు వేదికగా, బెలూన్ ఫెస్టివల్‌తో పాటు అడ్వంచర్ టూర్ ఆపరేటర్స్ జాతీయ సెమినార్ నిర్వహించనున్నామని వివరించారు. స్ధానిక పర్యాటక ప్రయోజనాలకు ఊతం ఇస్తూ కొండపల్లి, కొండవీడు, కోటప్పకొండలలో హిల్ ఫెస్టివల్స్ చేపడుతున్నామన్నారు.
పర్యాటకుల రాకకు విడిది ప్రధానం కాగా, 2014లో 6000గా ఉన్న హోటల్ రూమ్స్ సంఖ్యను ప్రస్తుతం 11,000కు తీసుకు వెళ్లామని, 2018 ఏప్రిల్ నాటికి మరో 2500 రూమ్‌లు అందుబాటులోకి రానున్నాయని శుక్లా వివరించారు. రాష్ట్రంలో ఐదు నక్షత్రాల హోటళ్ల సంఖ్య ఆరు నుండి 10కి చేరుకుందన్నారు. రూ.5,300 కోట్ల పెట్టుబడులు ఇప్పటికే క్షేత్ర స్ధాయికి చేరగా, 25,000 మంది ఉపాధి పొందగలిగారన్నారు.
మానవవనరుల అభివృద్దిలో భాగంగా ప్రతిఏటా పదివేల మంది గైడ్లు, క్యాబ్ డ్రెవర్లు, ఛెప్‌లకు స్వల్పకాలిక శిక్షణలు అందిస్తున్నామన్నారు. పర్యాటకుల రాక పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడవ స్ధానంలో ఉండగా, రానున్న మూడు సంవత్సరాల కాలంలో రెండవ స్ధానానికి చేరుకోవాలన్న లక్ష్యాన్ని కలిగి ఉన్నామని హిమాన్హు వివరించారు. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో 36 అవార్డులు అందుకోగా, సమీకృత పర్యాటక అభివృద్దికి గాను 2017,2018 సంవత్సరాలలో వరుసగా కేంద్రప్రభుత్వం నుండి ఉత్తమ రాష్ట్రంగా అవార్డులు అందుకున్నామన్నారు.
రానున్న సంవత్సరంలో ఇప్పటికే మౌళిక వసతులు ఉన్న 15 ప్రాంతాలలో పాటు, వసతులు లేని మరో 10 ప్రాంతాలను కూడా పర్యాటక పరంగా పూర్తి స్ధాయిలో అభివృద్ధి చేయనున్నామన్నారు. ఎపిటిడిసి పరంగా గణనీయమైన ప్రగతిని నమోదు చేస్తున్నామని, 125 కోట్ల అదాయ లక్ష్యంను కలిగి ఉండగా, ఇప్పటికే 120 కోట్లను గడించామని మరో త్రైమాసికం మిగిలి ఉండగా, రూ.132 కోట్లు సాధించగలమన్న ధీమాను వ్యక్తం చేసారు. విజయవాడ భవానీ ద్వీపంలో నీటి సింహాల పార్కును ఏర్పాటు చేయనున్నామన్నారు. జల క్రీడల ద్వారా గణనీయమైన అదాయం గడిస్తున్నామని, దీనికి ఉన్న భవిష్యత్తు రీత్యా పిపిపి విధానంలో మరికొందరితో కలిసి పనిచేయనున్నామన్నారు. ఆంధ్రా ఆహార రుచులను అభివృద్ది చేసే క్రమంలో ప్రతినెల ఆహార పండుగలను నిర్వహిస్తున్నామని హిమాన్హు శుక్లా పేర్కొన్నారు. పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో సరికొత్త ఆలోచనలకు కార్యరూపం ఇస్తూ పర్యాటక శాఖ గణనీయమైన అదాయ వనరుగా రూపుదిద్దుకుంటుందని శుక్లా వివరించారు.