ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (15:51 IST)

గత ప్రభుత్వం తప్పులు కొనసాగించాలంటే ఎలా..?: మంత్రి కురసాల కన్నబాబు

ఏపిలో శాసనవ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు మధ్య పోరాటం జరుగుతుందంటూ.. చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నాడని రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  న్యాయస్థానాల పట్ల మా ప్రభుత్వానికి ఎంతో గౌరవం వుందని, ప్రతి తీర్పును మేం అమలు చేస్తున్నామని అన్నారు. అదే క్రమంలో ఇటీవల హైకోర్ట్‌ ఇచ్చిన గ్యాగ్‌ తీర్పుపై దేశ వ్యాప్త చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానిలో ప్రభుత్వపరంగా స్పందించాల్సిన పరిస్థితి ఎదురయ్యిదని అన్నారు. 
 
మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే...
 
1) రహదారులకు మరమ్మతులు చేయడం కోసం పెట్రోల్‌పై సెస్‌ను పెంచాలని గత కేబినెట్‌లో మంత్రివర్గం నిర్ణయించింది. ఈ డబ్బును పూర్తిగా రోడ్ల రిపేర్లకే ఖర్చు చేయాలని తీర్మానించింది. దీనిని తప్పుపడుతూ చంద్రబాబు అనుకూల మీడియా పెద్ద ఎత్తున కథనాలు రాయడం దురదృష్టకరం.

ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తప్పుపట్టడం, ప్రభుత్వ ఖ్యాతిని పలుచన చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వేరువేరు సందర్భాల కోసం చంద్రబాబు హయాంలో పెట్రోల్ పై భారాన్ని మోపారు. అలాగే గత కొద్దికాలంలోనే కేంద్రం దాదాపు ఏడెనిమిది సార్లు పెట్రోల్‌ పై భారం మోపింది. దీనిపై చంద్రబాబు అనుకూల మీడియా ఎందుకు స్పందించలేదు?
 
2) న్యాయవ్యవస్థ అంటే మాకు సంపూర్ణ గౌరవం వుంది. అందుకే వాటి పట్ల నిబద్ధతతో వున్నాం. ఏ విషయంలో అయినా సరే కోర్ట్‌లు ఇచ్చిన తీర్పులను అమలు చేసేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో రాజ్యాంగ బద్దంగానే పాలన సాగిస్తున్నాం. ఎక్కడా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం లేదు. 
 
3) మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్, తదితరులకు సంబంధించిన కేసులో ఎపి హైకోర్ట్ ఇచ్చిన గ్యాగ్ తీర్పుపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. మేధావి వర్గాల్లోనే కాదు..ఈరోజు సాధారణ ప్రజల్లో కూడా ఈ తీర్పుపై చర్చ జరుగుతోంది.

దమ్మాలపాటి, తదితరులపై అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా  భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అయితే దానిని బయట పెట్టవద్దు, దీనిలోని పేర్లు మీడియాలో రాకూడదని, ప్రోటెక్ట్ చేస్తూ హైకోర్ట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులపై దేశ వ్యాప్తంగా న్యాయనిపుణులు, మీడియా ప్రముఖులు, రాజ్యాంగ నిపుణులు వ్యతిరేకంగా స్పందించారు. 
 
4) గతంలో సుప్రీంకోర్ట్ న్యాయమూర్తులు రంజన్ గొగోయ్, దీపక్‌ మిశ్రాలపై ఆరోపణలు వచ్చినప్పడు కూడా కోర్ట్‌ల నుంచి ఇటువంటి గ్యాగ్ ఆర్డర్‌లు రాలేదు. కానీ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి, ఇతరులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై ఇటువంటి తీర్పు ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావడం లేదు. న్యాయ వ్యవస్థను పూర్తిగా గౌరవిస్తున్నాం కాబట్టి మేం ఈ గ్యాగ్‌ తీర్పుపై స్పందించ లేదు.

కానీ దేశవ్యాప్త చర్చ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం తరుఫున స్పందించాల్సి అనివార్య పరిస్థితి మాకు ఎదురైంది. సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి కుమార్తెలు, దమ్మాలపాటి శ్రీనివాస్‌ల ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఎఫ్ఐఆర్‌లో నమోదైన అంశాలను మీడియాకు, సోషల్ మీడియాకు వెల్లడించకూడదు, దీనిపై ఎవరూ మాట్లాడకూడదు అన్న ఉత్తర్వులు కోర్ట్‌ నుంచి వచ్చినప్పుడు, ఇలాగే రేపు ఇతర కేసుల్లో కూడా తీర్పులు ఇస్తారా? అన్న ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. 
 
5) ఎఫ్‌ఐఆర్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్, సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా అడిగితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. పారదర్శకత కోసం పబ్లిక్ డాక్యుమెంట్లను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుని, చట్టాలు చేశాయి.

ఇప్పుడు దానికి భిన్నంగా కోర్ట్ తీర్పు ఇవ్వడం పై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గతంలో మీడియాపై ఆంక్షలు ఎలా పెడతారంటూ ఇదే కోర్ట్‌లు ప్రశ్నించిన విషయం వాస్తవం కాదా? గ్యాగ్ ఆర్డర్‌లు ఏ సందర్భంలో ఇవ్వవచ్చు, అవి అన్ని సందర్భాల్లో ఇస్తారా? కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే వస్తాయా అనేదానిపై చర్చ జరగాలి.
 
6) అమరావతిలో జరిగిన భూకుంభకోణంలో మంత్రివర్గ ఉపసంఘం విచారణ, సిట్ ఏర్పాటుపై ముందుకు వెళ్ళవద్దని హైకోర్ట్ ఆదేశించింది. మంత్రివర్గ ఉపసంఘం అనేది శాసనసభకు వున్న అధికారాల పరిధిలోని అంశం. దీనిలో కోర్ట్ జోక్యం చేసుకోవడంపై కూడా చర్చ జరగాలి.

శాసన వ్యవస్థకు కొన్ని హక్కులు వుంటాయి. ఉపసంఘం ఏర్పాటు శాసనపరిధిలో జరుగుతుంది. ఉపసంఘం ఇచ్చిన నివేదికకు విలువ లేదనట్లుగా కోర్ట్‌ ఇచ్చిన తీర్పుపై చర్చ జరగాలి. మంత్రివర్గ ఉపసంఘాలు వేయడం, నివేదికలు ఇవ్వడం కొత్తకాదు. టిడిపి హాయంలో కూడా వేశారు. శాసనసభకు వున్న ప్రివిలేజ్ ఉపసంఘాలు వేయడం. 
రాజ్యాంగ నిపుణులు, న్యాయనిపుణులు దీనిపైన కూడా స్పందించాలి. 
 
7) గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను సమీక్షించే అధికారం తరువాత వచ్చిన ప్రభుత్వానికి లేదనే హైకోర్ట్ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రజలు అయిదేళ్లు పాలించాలని అధికారం ఇస్తారు. ధర్మకర్తలా ప్రభుత్వం పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, న్యాయాన్యాయ విచక్షణతో పాలించడం, ముందు తరాలకు మేలు జరిగేలా శాసననాలు చేయడం ప్రభుత్వ బాధ్యత.

గత ప్రభుత్వాల నిర్ణయాలను సమీక్షించే అధికారం లేదు అంటే, ఏ ప్రభుత్వం అయినా ప్రజావ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల్లో మార్పులు చేసిన చరిత్ర గతంలో చూడలేదా? ఇప్పుడు కొత్తగా జరుగుతున్నాయా? అలా అయితే 2జీ స్కాంలో తరువాత వచ్చిన ప్రభుత్వాలు విచారణ జరపలేదా? 
 
8) అమరావతి అనేది రాజధానిగా కాకుండా రియల్ ఎస్టేట్ కేపిటల్ గా రూపొందుతుందని మేం మొదట్లోనే చెప్పాం. ఆనాటి ప్రభుత్వంలో చంద్రబాబుకు చాలా అనుకూలంగా వున్న వారు, ఆ పార్టీకి చెందిన వారు భూముల ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్ చేశారని ప్రజల్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినప్పుడు, దానిని నిగ్గు తేల్చే బాధ్యత కొత్తగా వచ్చిన  ప్రభుత్వానికి లేదని ఎలా చెబుతారు?

గత ప్రభుత్వం తప్పులు చేస్తే, దానిని కొనసాగించాలంటే అదేం రూల్?  అసలు కేబినెట్ ఉపసంఘాల నియామకం, వాటి అస్తిత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి వచ్చిందంటే దానిపై చర్చ జరగాలి.
 
9) ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ ప్రజల పక్షాన తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఎవరైనా సరే అభినందించాల్సిన పరిస్థితి వుంది. కానీ వాటిపట్ల కూడా రకరకాల వ్యాఖ్యానాలు వచ్చాయి. విశాఖలో రసాయన గ్యాస్ వల్ల ప్రమాదం జరిగినప్పుడు సీఎం గారు నిర్ణయం తీసుకుని, అక్కడ లీటర్ స్టెరైన్ గ్యాస్ కూడా వుండకూడదని ఆదేశించారు.

వెంటనే దానిని విశాఖ నుంచి తరలించారు. దీనిపై అందరూ హర్షించారు. కానీ తరువాత స్టెరైన్‌ను ఎవరు తరలించమన్నారు అనే వ్యాఖ్యానాలు వచ్చాయి. ప్రజల ప్రాణాలను బలి తీసుకున్న స్టెరైన్‌ను ఎందుకు తరలించడం లేదు అని అడగాలి కానీ, దానికి భిన్నంగా వ్యాఖ్యనాలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 
 
10) పార్లమెంట్‌లో వైయస్‌ఆర్‌సిపి ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలు ఏపిలో ఎలాంటి పరిస్థితి వుందో విపులంగా చెప్పారు. ప్రజా ప్రయోజనాల పేరుతో కొన్ని పార్టీలు కోర్ట్‌లో వేస్తున్న కేసులు, ప్రభుత్వానికి ఎలా ఆటంకాలు కల్పిస్తున్నారో వివరించారు. రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తే ఈ ప్రభుత్వాన్ని కోర్ట్‌లు నిలదీయవచ్చు.

కానీ అడుగడుగునా ఈ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏ ప్రభుత్వం అయినా సరే అయిదేళ్ళ కాలపరిమితితో పనిచేస్తుంది. వచ్చే తరాల కోసం మీరు ఎలా నిర్ణయాలు తీసుకుంటారని ప్రశ్నించడం, విచిత్రమైన వాదనలను ఏపిలోనే చూస్తున్నాం. ప్రభుత్వం కాకపోతే ప్రతిపక్షంలో వున్న చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారా? 
 
11) చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్‌కు వెళ్లింది. వైయస్‌ఆర్‌సిపి ఓటింగ్ 16 శాతం పడిపోయిందని చంద్రబాబు చెబుతున్నాడు. ఎవరు చేశారు సర్వే? ఎన్నికల ముందు మీకు 170 సీట్లు వస్తాయంటూ నివేదికలు ఇచ్చిన సంస్థలే ఇప్పుడు ఈ సర్వే చేశారా? గోబెల్స్‌కు వారసత్వం వున్నట్లుగా టిడిపి ప్రవర్తిస్తోంది. చంద్రబాబుకు ఈ పదహారు శాతం కలిసినట్లు, ఆయన రేపే సీఎంగా సీట్‌లో కుర్చున్నట్లుగా భ్రమ పడుతున్నట్టున్నాడు.
 
12) రాజధానిలో పేదలకు 1300 ఎకరాల్లో ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తే, చంద్రబాబు మనుషులు కోర్ట్‌లకువెళ్ళి స్టేలు తీసుకువచ్చారు. చంద్రబాబు తలపెట్టిన అమరావతి రాజధాని పేదల కోసం కాదు... కొందరు పెద్దల కోసమే అని గతం నుంచి మేం చెబుతున్న మాటలకు ఇది నిదర్శం కాదా?

ఇక్కడ పేదలు వుండకూడదు, పెద్దలే వుండాలని వారు అనుకున్నారు. అందుకే అమరావతిలో టిడిపికి ఒక్క సీటు కూడా  రాలేదు. గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరికి ఇళ్ళ స్థలాలు ఇచ్చారో మీడియాలో తాజాగా చూస్తున్నాం. ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు ఎలా మోకాలడ్డాలి, ఎలా ఇరుకున పెట్టాలనే అజెండాతో చంద్రబాబు పనిచేస్తున్నాడు. 
 
13) రమేష్ హాస్పటల్స్‌ నిర్లక్ష్యం వల్ల 10 మంది ప్రాణాలు పోయిన ఘటనలో ప్రభుత్వం స్పందించవద్దా? కేసులు పెట్టవద్దా? ఎందుకు కేసులు పెట్టారని ఎలా అడుగుతారు? నిమ్మగడ్డ రమేష్, రమేష్ హాస్పటల్స్, అమర్‌రాజా బ్యాటరీస్‌ విషయంలో కోర్ట్‌ల నుంచి ఎలాంటి తీర్పులు వచ్చాయో చూశాం.

చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ఎటువంటి వ్యాజ్యాలు వేయిస్తున్నారో, ఈ ప్రభుత్వాన్ని ఎలా ఇబ్బంది పెడుతున్నాడో చూస్తున్నాం. రాష్ట్రంలో శాసన వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు మధ్య ఏదో జరిగిపోతోందోందనే భావన చంద్రబాబు సృష్టిస్తున్నాడు.

ప్రతిచోటా ఒకరకమైన అశాంతి వుందనే తప్పుడు ప్రచారం చంద్రబాబు పనిగట్టుకొని చేస్తున్నాడు.  న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య పోరాటం జరుగుతుందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నాడు. న్యాయ వ్యవస్థపై మాకు సంపూర్ణ గౌరవం వుంది. చంద్రబాబు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. 
 
14) నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళు జరగడం లేదు, రైతులు నష్టపోతున్నారంటూ చంద్రబాబు, టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి 2016-17లో నెల్లూరు జిల్లాలో 24వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత మొదటి ఏడాది 1.90 లక్షల మెట్రిక్ టన్నులు, ఈ ఏడాది 3.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం.

ఈ ఏడాది ఇంకా లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. దీనిపైనా చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఏలేరుకు వరదలు వస్తే.. మంత్రులుగా మేం పర్యటిస్తూ వుంటే... టిడిపి నేతలు మా పై విమర్శలు చేస్తున్నారు. అయిదేళ్ళలో  ఏలేరు మోడ్రనైజైషన్ చేయపోవడం వల్లే ఇప్పుడు ముందు వచ్చిందనే విషయం వాస్తవం కాదా?  
 
15) న్యాయ వ్యవస్థ ఇచ్చిన ప్రతి తీర్పును మేం గౌరవిస్తున్నాం. ఇళ్ళ స్థలాలు ఇవ్వొద్దంటే... ఇవ్వకుండా ఆపేశాం. రమేష్ హాస్పటల్స్‌పై విచారణ వద్దంటే నిలిపివేశాం. విశాఖలో 12 మంది గ్యాస్ ఘటనలో చనిపోయారు. సీఎంగారు స్పందించి వెంటనే చర్యలు తీసుకున్నారు. దోషులను అరెస్ట్‌ చేసి కోర్ట్ ముందు నిలబెట్టారు.

మరి పదిమంది చనిపోతే... రమేష్ హాస్పటల్స్‌ పై స్పందించవద్దంటే ఏం చేయాలి?  న్యాయం అందరికీ ఒకేలా వుండాలి.. వ్యక్తులను బట్టి న్యాయం మారదు. న్యాయం కోసం సుప్రీంకోర్ట్‌ కు వెళ్ళాం. రమేష్‌ హాస్పటల్స్‌ సంఘటన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో అదే ముఖ్యం. ఎవరు కాపాడినా.. ప్రజలు మాత్రం వీళ్ళను కాపాడరు. అది గుర్తుంచుకోవాలి.