లిఫ్టిచ్చిన పాపానికి గొంతు కోశాడు...
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. లిఫ్టిచ్చిన పాపానికి ఓ వ్యక్తి గొంతు కోసి పారిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్, గాజులరామారం డివిజన్ చంద్రగిరి నగర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చంద్రగిరి నగర్‌కు చెందిన ఇమ్రాన్(28) అనే వ్యక్తి వృత్తిరీత్యా వంట మనిషి. రాత్రి శ్రీరామ్ నగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పనులు ముగించుకొని తెల్లవారుజామున ఇంటికి బైక్‌పై బయలుదేరాడు.
మార్గమధ్యలో ఓ గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడగ్గా బైక్‌పై ఎక్కించుకొని వెళుతున్న సమయంలో వెనుక కూర్చొని తన వెంట తెచ్చుకున్న కత్తితో ఇమ్రాన్ గొంతుకోసి పరారయ్యాడు. దీంతో రక్తపుమడుగులో పడివున్న ఇమ్రాన్‌ను స్థానికులు గుర్తించి సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.