శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2017 (10:22 IST)

అదనపు కట్నం కోసం భార్యపై పోలీస్‌ హత్యాయత్నం... జైలుపాలు

అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను అదనపు కట్నం కోసం తీవ్రంగా కొట్టి, చిత్రహింసలు పెట్టిన ఓ ఖాకీ జైలుపాలయ్యాడు. హైదరాబాద్ నగరంలోని ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను అదనపు కట్నం కోసం తీవ్రంగా కొట్టి, చిత్రహింసలు పెట్టిన ఓ ఖాకీ జైలుపాలయ్యాడు. హైదరాబాద్ నగరంలోని ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
యాచారం మండలం తమ్మలోనిగూడెం గ్రామానికి చెందిన తొట్ల సాలయ్య(30) మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 2011లో నాగిళ్ల గ్రామానికి చెందిన జ్యోతి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. కొంతకాలం నుంచి అదనపు కట్నం కోసం సాలయ్య భార్యపై దాడి చేస్తున్నాడు. దీంతో ఆమె మాడ్గుల, యాచారం పోలీస్‌స్టేషన్లను ఆశ్రయించింది. 
 
పోలీసులు అతనికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. పోలీసులకు చెప్పడంతో ఆగ్రహించిన సాలయ్య.. భార్యను తీవ్రంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో విషయం తెలుసుకున్న సీఐ అక్కడికి చేరుకుని తన వాహనంలోనే ఆమెను కామినేని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆమె అపస్మారక స్థితిలో ఉంది. 
 
బంధువుల నుంచి ఫిర్యాదు తీసుకున్న సీఐ చంద్రకుమార్‌.. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మొబైల్ ఇంట్లోనే వదిలివెళ్లిన నిందితుడు తుర్కయాంజల్‌లో భార్య, సోదరులకు తెలియకుండా నిర్మించుకున్న ఇంటిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి గురువారం పట్టుకున్నారు. సాలయ్య తీరును రాచకొండ కమిషనర్‌కు రిపోర్టు చేశామని ఏసీపీ వెల్లడించారు.