మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 12 అక్టోబరు 2018 (10:58 IST)

టీడీపీ నేతలే టార్గెట్ : నిన్న సుజనా.. నేడు సీఎం రమేష్ ఇళ్లలో సోదాలు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ నేతలో లక్ష్యంగా ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొన్నటికి మొన్న టీడీపీ నేత బీద మస్తాన్ రావుకు చెందిన కంపెనీల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. నిన్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి నివాసంతో పాటు.. ఆయనకు చెందిన కంపెనీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నేడు (శుక్రవారం) రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.
 
హైదరాబాద్, కడప జిల్లాలోని సీఎం నివాసాల్లో ఏకకాలంలో ఈ సోదాలు ప్రారంభంకాగా, ఈ తనిఖీల్లో 60 మంది ఐటీ అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని సీఎం రమేష్‌ నివాసం, ఆఫీసు, కడప జిల్లా పోట్లదుర్తిలోని సీఎం రమేష్‌ నివాసంలోనూ సోదాలు చేస్తున్నారు. ఎంపీ సోదరుడి నివాసంలోనూ సోదాలు సాగుతున్నాయి.
 
సీఎం రమేష్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. కేంద్ర పీఏసీ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్‌ ఢిల్లీలో జరిగిన పీఏసీ సమావేశంలో... దేశంలో ఐటీ దాడులు ఎక్కడ, ఎందుకు చేస్తున్నారు, ఏపీలో దాడుల వివరాలు ఇవ్వాలంటూ ఐటీకి ఆయన నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన మూడు రోజుల్లోనే రమేష్‌ ఆస్తులపై దాడులు జరగడం గమనార్హం. 
 
మరోవైపు కడప ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి శుక్రవారానికి వంద రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రితో భేటీ అవ్వాలని నిర్ణయించారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని కేంద్రమంత్రిని ఎంపీలు కోరనున్నారు. ఇందుకోసం ఎంపీల బృందం ఢిల్లీకి చేరుకుంది. కడప ఉక్కు పరిశ్రమపై ప్రశ్నిస్తున్నందుకే సీఎం రమేష్ ఇంట్లో ఐటీ సోదాలు చేపట్టిందనే అభిప్రాయాన్ని టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.