గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 10 అక్టోబరు 2018 (16:22 IST)

ఏంది స్వామీ ఇది.. మీదగ్గరేమైనా అక్షయపాత్ర ఉందా? చంద్రబాబుకు జేసీ సూటి ప్రశ్న

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అధికార టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు ప్రశంసల వర్షం కురిపించారు. ఏంది స్వామీ ఇది.. మీదగ్గరేమైనా అక్షయపాత్ర ఉందా లేదా ఆంధ్రా కోసం ప్రత్యేకంగా కరెన్సీని ముద్రించే ప్రింటింగ్ మిషన్ ఉందా అంటూ ప్రశ్నించారు. పైగా ఈ ప్రశ్నకు ఇపుడే సమాధానం చెప్పాలంటూ వేదికపై నిలదీశారు. దీంతో వేదికపై వున్నంతవారితో పాటు సభకు వచ్చిన ప్రజలు నవ్వుల్లో మునిగిపోయారు.
 
చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించి, బైరవానితిప్ప ప్రాజెక్టు వద్ద పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబును ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. నదుల అనుసంధానం గురించి చాలాకాలంగా విన్నామని, ఏ మొగోడు చేయలేదని... కానీ దాన్ని చంద్రబాబు కార్యాచరణలో చేసి చూపించారని జేసీ ప్రశంసించారు. నదుల అనుసంధానం వల్లే బైరవానితిప్ప ప్రాజెక్టుకు నీళ్లొస్తున్నాయని, అందుకు చంద్రబాబుకు జేసీ ధన్యవాదాలు తెలిపారు. 
 
అలాగే, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి కేంద్రం నిధులివ్వకుండా మొండిచేయి చూపినా.. పనులు చేస్తున్నారని.. డబ్బులెక్కడ నుంచి వస్తున్నాయని.. మీ దగ్గరేమైనా అక్షయ పాత్ర ఉందా లేక ఆంధ్రా కోసం ప్రత్యేకంగా ఒక ప్రింటింగ్ మిషన్ పెట్టారా.. ఈ రహస్యం మాత్రం చెప్పాల్సిందేనని జేసీ చంద్రబాబును ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు.