ఇంటి వద్దే జెసి బ్రదర్స్ దీక్ష
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది.తొలుత తహశీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షకు జెసి బ్రదర్స్ పిలుపునిచ్చిన విషయం విధితమే. ఈక్రమంలో సోమవారం ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్తున్న ఆయన్ను పోలీసులు గృహనిర్బంధం చేశారు.
బయటకు వద్దంటూ వారించారు. దీంతో ఆయన ఇంటివద్దే దీక్షకు దిగారు. మరోవైపు జూటూరు వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని సైతం పోలీసులు అక్కడే నిర్బంధించారు. దీంతో పోలీసుల తీరుపై జెసి దివాకర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తనపై ఇలాంటి నిర్బంధాలు ఏమిటని ప్రశ్నించారు.
దీంతో తాడిపత్రిలో రాజకీయం వాతావరణం వేడెక్కింది. రెండు వారాలుగా ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ జేసీ సోదరులు సోమవారం నాడు తాడిపత్రిలో నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం.. దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.