బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 4 జనవరి 2021 (12:39 IST)

30వ తేదీలోగా లక్షలాదిమంది దళితులతో 'ఛలో పులివెందుల': టీడీపీ

జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎస్సీ,ఎస్టీలు, బీసీలు, మైనారిటీలపై దాడులు విచ్చలవిడిగా జరుగుతున్నాయని, పులివెందులలో దళితమహిళ నాగమ్మపై అత్యాచారం చేసి,  అతిదారుణంగా హతమార్చిననేపథ్యంలో టీడీపీనేతలు ఛలో పులివెందుల కార్యక్రమం తలపెడితే, 21 మంది ప్రతిపక్షనేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం దేశంలోనే అత్యంతహాస్యా స్పదమని టీడీపీనేత ఎమ్.ఎస్.రాజు తెలిపారు.

ఆయన తన నివాసంనుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.   మాదిగవర్గానికి చెందిన వంగలపూడి అనితపై, టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడినైన తనపైకూడా అట్రాసిటీ కేసు పెట్టారన్నారు. దళితుల రక్షణకోసం, వారి హక్కులకోసం ఉన్నచట్టాలను వారిపైనే ఉపయోగించడం ఈరాష్ట్రంలోనే చూస్తున్నామన్నారు. ఇతరవర్గాల నుంచి కాపాడుకోవడానికి దళితులకు రక్షణగా ఉన్న చట్టాలను వారిపైనే ప్రయోగించడం దారుణమన్నారు.

దళితమహిళను దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తే, దానిపై ప్రశ్నించారన్న అక్కసుతో టీడీపీదళితనేతలపై, ఇతర వర్గాలనేతలపై అట్రాసిటీ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ముమ్మాటికీ కక్షసాధింపుల్లో భాగంగా జరిగిందేనన్నారు. చెన్నైలో ఉన్న బీటెక్.రవిని అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు.

ఫ్యాక్షన్ మనస్తత్వంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తుంటే, ఐపీఎస్ అధికారిగా ఉన్న, ఎస్టీవర్గానికి చెందిన డీజీపీ సవాంగ్ మౌనంగా ఉండటం దారుణమన్నారు. వైసీపీనేతలు తమస్వార్థానికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వాడుకుంటుంటే, డీజీపీ మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు.

జే.సీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి ఆయుధాలతో వెళ్లిన పెద్దారెడ్డిపై కేసులు పెట్టనిప్రభుత్వం, బాధిత కుటుంబమైన ప్రభాకర్ రెడ్డి  కుటుంబసభ్యులపైనే తప్పుడు కేసులు పెట్టిందన్నారు. దళిత మహిళపై జరిగిన అత్యాచారాన్ని,ఆమెని బలితీసుకున్న తీరుని ప్రశ్నించామన్న అక్కసుతో తమపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిన ప్రభుత్వం, దళితడాక్టర్ సుధాకర్ ని దారుణంగా వేధింపులకు గురిచేసిన ముఖ్యమంత్రిపై ఎందుకు అట్రాసిటీ కేసు పెట్టలేదని రాజు ప్రశ్నించారు.

దళితయువకుడు ఓంప్రతాప్ ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై, రాజమండ్రిలో శిరోముండనం ఘటనలో కీలకసూత్రధారులైన వైసీపీ నేతలపై ఇప్పటివరకు ఎందుకు అట్రాసిటీ కేసులు నమోదు చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దమనకాండ డీజీపీకి కనిపించడం లేదా అని రాజు నిలదీశారు.

శాంతియుతంగా పులివెందులకు వెళ్లడానికి బయలుదేరిన టీడీపీనేతలపై అట్రాసిటీ కేసులు పెట్టినంతమాత్రాన ప్రభుత్వ దుర్మార్గాలను చూస్తూ ఊరుకునేది లేదని రాజు హెచ్చరించారు. ఇంకా పట్టుదలతో ప్రభుత్వ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ముందుకు సాగుతామన్నారు. దళితుల రక్షణకు ఉపయోగించాల్సిన చట్టాలను తుంగలో తొక్కిన డీజీపీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నాడని టీడీపీనేత మండిపడ్డారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అమల్లో లేదని మరోమారు తేలిపోయిదన్నారు.  దళితమహిళ కుటుంబానికి న్యాయం చేయమని అడిగిన సాటిదళిత మహిళ అనితపై అట్రాసిటీ కేసుపెట్టినందుకు హోంమంత్రి ఏంసమాధానంచెబుతారో చెప్పాలన్నారు. ఇవేవీ తనకు తెలియవన్నట్లు హోంమంత్రి, ముఖ్యమంత్రి నటిస్తే, ఆ నటనలు ఎల్లకాలం సాగవన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా, జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న అరాచకవిధానాలకు వ్యతిరేకంగా పులివెందుల గడ్డపైనే లక్షలాది మంది దళితులతో నిరసన తెలియచేసి తీరుతామని రాజు తీవ్రస్వరంతో హెచ్చరించారు. ఎన్ని వేలమందిపై ఈ ముఖ్యమంత్రి ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతాడో చూస్తామని, జగన్ సాగిస్తున్న కుట్రరాజకీయాలకు భయపడేది లేదన్నారు.

ఎక్కడైతే ఎస్సీ, ఎస్టీకేసులతో ప్రతిపక్షానికి చెందిన దళిత నేతలను అడ్డగించారో, అక్కడనుంచే ప్రభుత్వ పతనం ప్రారంభమవుతుందన్నారు. దళితులను అణచివేయడానికి అట్రాసిటీ చట్టాన్ని ఉపయోగించడం అనేది ఈ రాష్ట్రంలోతప్ప, మరెక్కడా జరగలేదన్నారు. జగన్ నాయకత్వంలో దళిత యువకులు, ఆడబిడ్డలు ఎంతమంది బలయ్యారో డీజీపీకి తెలియదా అని రాజు నిలదీశారు.

డీజీపీ ఇండియన్ పీనల్ కోడ్  ను అమలుచేయకుండా, జగన్ చట్టాలను అమలుచేస్తున్నా డన్నారు. మాచర్ల ప్రాంతంలో పోలీసుల సాయంతో దళిత యువకుడు హత్యకు గురైతే, ఆనాడు డీజీపీ పోలీసులపై ఎందుకు అట్రాసిటీ కేసులు పెట్టలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంతలా అణిచివేయాలని చూస్తే, అంతలా దళితులు తిరగబడతారని రాజు తేల్చిచెప్పారు.

రాష్ట్రంలో పోలీసులు వైసీపీకార్యకర్తల్లా వ్యవహరిస్తు న్నారని, ఉత్తరప్రదేశ్ , బీహార్లో జరిగిన సంఘటనలను రాష్ట్రంలో చూస్తున్నామన్నారు. దళితమేథావులు, దళిత సంఘాలవారు జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న దళితవ్యతిరేకపాలనపై, దళితులను అణచివేస్తున్నతీరుపై ఒక్కసారి ఆలోచించాలన్నారు.  

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుకి నిరసనగా, పులివెందుల గడ్డపైనే జనవరి 30వతేదీ లోగా లక్షలాది మంది దళితులతో నిరసన కార్యక్రమం చేపట్టి తీరుతామని, ఎందరిని అరెస్ట్ చేస్తారో చూస్తామని రాజు తేల్చిచెప్పారు.