సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (14:58 IST)

జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు వరుసగా ఎదురు దెబ్బలు

ఏపీలోని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పర్యవసానాలు చూడకుండా, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్తున్న జగన్ కు, కోర్టుల్లో, వివిధ ట్రిబ్యునల్స్ లో, ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అవగాహనా రాహిత్యమో లేక వ్యక్తిగత పగతో వెళ్తూ ప్రొసీజర్ ఫాలో అవ్వకపోవటమో కాని, ప్రతి విషయంలో జగన్ కు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 
 
ఇప్పటికే విద్యుత్ పీపీఏల విషయంలో, అటు ట్రిబ్యునల్ లోను, ఇటు కోర్టుల్లోనూ మొట్టికాయలు పడ్డాయి. ఆ తరువాత పోలవరం విషయంలో ఎదురు దెబ్బ తగిలింది. రంగులు వేసే విషయంలో కూడా కోర్ట్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు సీనియర్ అధికారుల సస్పెన్షన్ వ్యవహారంలో క్యాట్ చేతిలో, జగన్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓగా, గతంలో జాస్తి కృష్ణ కిషోర్ పని చేసిన విషయం తెలిసిందే.
 
అయితే ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు అంటూ, జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేసింది.
 
జాస్తి కృష్ణ కిషోర్ కేంద్రం నుంచి మన రాష్ట్రానికి డెప్యుటేషన్ పై వచ్చారు. చంద్రబాబు హయంలో ఆయన రాష్ట్రానికి పెట్టుబులు తేవటానికి ఎంతో కృషి చేసారు. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓగా, ఆయన పని చేసారు. 
 
కానీ, ఆయన చంద్రబాబుకు బాగా సన్నిహితంగా ఉండే వారనే కారణంతో, ఆయన పై ప్రభుత్వం వ్యక్తిగత కక్ష పెంచుకుంది అనే వాదన కూడా ఉంది. ఒక సీనియర్ అధికారి, అది కూడా రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన అధికారి పై ఇలా సస్పెన్షన్ వేటు వెయ్యటం పై అందరూ ఆశ్చర్య పోయారు. అది కాక, జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కృష్ణ కిషోర్ కు జీతం కూడా ఇవ్వలేదు. దీంతో, ఈ విషయం పై జాస్తి కృష్ణ కిషోర్, ఏపి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా, క్యాట్ కు వెళ్లారు.
 
 దీనిపై, నెల రెండు నెలల నుంచి విచారణ జరిపిన క్యాట్, ఈ రోజు తుది తీర్పు ఇచ్చింది. 
 
జాస్తి కృష్ణ కిషోర్ సస్పెన్షన్ రద్దు చేస్తూ, సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వానికి అదిరిపోయే షాక్ తగిలింది. కృష్ణ కిషోర్ కేంద్ర సర్వీసులకు వెళ్ళటానికి, మార్గం సుగుమం అయ్యింది. కావాలంటే, ఆయనపై కేసులు పెట్టుకుని, చట్ట ప్రకారం వెళ్ళండి అంటూ, క్యాట్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. గతంలో విచారణ సందర్భంగా కూడా క్యాట్ ప్రభుత్వాన్ని, తప్పుబట్టిన సంగతి తెలిసిందే. 
 
కృష్ణ కిషోర్‌కు జీతం ఎందుకు ఇవ్వలేదు అంటూ, క్యాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు ఉన్నా, ఎందుకు జీతం చెల్లించలేదు అంటూ, చీఫ్ సెక్రటరీని పిలిపిస్తాం అని, వార్నింగ్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోపక్క ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కూడా క్యాట్‌కు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై, వచ్చే నెల 6కు, క్యాట్ వాయిదా వేసింది.