పేదలందరికి ఇళ్ళు కేటాయింపు: మంత్రి బొత్స
పట్టణ ప్రాంతాల్లోని అర్హులైన పేదలందరికి ఇళ్ళు కేటాయింపు అంశంపై కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన మునిసిపల్ కమీషనర్ లతో రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష నిర్వహించారు.
స్థానిక ఆర్టీసీ పరిపాలన భవనం సమావేశ మందిరంలో మంగళవారం ప్రణాళికా శాఖ, సిడిఎమ్ఏ జిఎస్ఆర్కేఆర్.విజయ కుమార్, పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామల రావు, టెడ్కో ఎండి దీపక్, విజయవాడ మునిసిపల్ కమీషనర్ వి. ప్రసన్న వెంకటేష్ లతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు.
కృష్ణ, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ లు పరిధిలో గృహ నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులు వారి వాటా చెల్లించిన వాటి వివరాలపై మంత్రి సమీక్షించారు.
ప్రతి మునిసిపాలిటీ పరిధిలో అర్హులైన పేదలకు ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. గతంలో మంజూరు చేసిన ఉత్తర్వులు అర్హత లేని వారిని గుర్తించి తక్షణమే వాటిని జాబితా నుంచి తొలగించాలని మంత్రి సూచించారు.
వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి చేసిన సర్వే చేసి ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం అర్హులైన వారికి కేటాయింపులు పూర్తి చేయాలన్నారు.
రానున్న మూడు నెలల్లో వేసవి దృష్ట్యా త్రాగునీటి కొరత లేకుండా మునిసిపల్ కమిషనర్ లు తగిన కార్య ప్రణాళికలు తయారు చేసి, ఆమలు ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య పై చేపట్టవలసిన మరమ్మతులు, తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు.