శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 30 జనవరి 2020 (08:43 IST)

విశాఖలో పేదల ఇళ్ల నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్: బొత్స

విశాఖపై చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.  మీడియాతో మాట్లాడిన ఆయన.. మండలి విషయంలో చంద్రబాబు రెండు రకాలుగా మాట్లాడారని, రాజకీయాల కోసం చంద్రబాబు ఏదైనా మాట్లాడతారని విమర్శించారు.

జీఎన్ రావు, బోస్టన్ కమిటీ రిపోర్టులను హైపవర్ కమిటీ పరిశీలించాకే ప్రభుత్వం మూడు రాజధానులపై నిర్ణయం తీసుకుందని మంత్రి బొత్స స్పష్టం చేశారు. శివరామకృష్ణ కమిటీ గురించి మీరు పట్టించుకున్నారా? అంటూ చంద్రబాబునుద్దేశించి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి బొత్స ఉద్ఘాటించారు.

జీఎన్‌ రావు కమిటీ బోగస్ కమిటీ అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు విశాఖ అనుకూలం కాదని కమిటీ చెప్పిందంటున్నారని మంత్రి బొత్స ఫైర్ అయ్యారు. ఐదేళ్లకోసారి అమరావతిలో వరదలు వస్తూనే ఉంటాయన్నారు. హుద్‌హుద్ వల్ల విశాఖలో తీరప్రాంతమే నష్టపోయిందన్నారు.

తుపాను ముప్పులేకుండా ఏ నగరమైనా ఉంటుందా? అని మంత్రి బొత్స ప్రశ్నించారు. చెన్నై, ముంబైలకు తుఫాను ముప్పులేదా? అని అన్నారు. విశాఖకు తుఫాన్‌ ముప్పు ఉన్న సంగతి తెలుసునని, అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందన్నారు. విశాఖలో పేదల ఇళ్ల నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ చేపడతామన్నారు.

ల్యాండ్ పూలింగ్‌కు ముందుకొచ్చిన వాళ్ల భూమి తీసుకుంటామని తెలిపారు. విశాఖలో లక్షా 75వేల మందికి స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని మంత్రి తెలిపారు. మండలితో రాజధానికి ముడిపెట్టడం సరికాదని విపక్షాలకు హితవుచెప్పారు. అన్ని వర్గాలు, ప్రాంతాల శ్రేయస్సు కోసమే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

రాజ్యాంగ నిబంధనల ప్రకారమే మండలి రద్దుపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రూల్స్‌కు విరుద్ధంగా వెళ్లొద్దని మండలి చైర్మన్‌ను కోరామన్నారు. అయినప్పటికీ చంద్రబాబు చెప్పినట్లుగా చైర్మన్ వ్యవహరించారని ఆరోపించారు.

కాస్త ఆలస్యం అవుతుందేమోగానీ నిర్ణయం మారదని బొత్స ఉద్ఘాటించారు. రాష్ట్రం అభివృద్ధి కాకూడదని కొందరు కోరుకుంటున్నారని అన్నారు.