విశాఖ, కాకినాడ తీరంలో భారత్-అమెరికా సైనిక విన్యాసాలు
అరుదైన సైనిక విన్యాసాలకు విశాఖ, కాకినాడ సాగర తీరం వేదిక కాబోతోంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఏపీలోని సాగర జలాల్లో.. అమెరికా, భారత్‌లు సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి.
ఈ నెల 13 నుంచి మొదలయ్యే ఈ విన్యాసాలు 8 రోజుల పాటు కొనసాగనున్నాయి. విశాఖలోని తూర్పునౌకాదళం ఆధ్వర్యంలో విశాఖ, కాకినాడ తీరాల్లో విన్యాసాలు నిర్వహించనున్నారు.
500 మంది అమెరికన్ మెరైన్స్, సెయిలర్స్, ఎయిర్‌మెన్, భారత దేశపు త్రివిధ దళాలకు చెందిన 1,200 మంది ఈ విన్యాసాల్లో భాగస్వాములుకానున్నారు. అలాగే భారత్, యూఎస్‌ఎస్ జర్మన్ టౌన్ యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో పాలు పంచుకోనున్నాయి.
‘టైగర్ ట్రయాంఫ్’పేరుతో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక విన్యాసాలను ఇండో, పసిఫిక్ సాగర జలాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ఉపయోగపడతాయని రక్షణరంగ నిపుణులు భావిస్తున్నారు.
ప్రపంచ దేశాలకు సవాల్ విసరుతున్న ఉగ్రవాదాన్ని అణిచివసేందుకు, టెర్రరిస్టులను హెచ్చరిస్తూ.. ఇండో, అమెరికా ఆయుధ సంపత్తి ద్వారా సత్తా చాటేందుకు ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఇంతకు ముందే భారత్, అమెరికాలు సంయుక్తంగా వివిధ దేశాలతో కలిసి యూఎస్–ఏషియన్ ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించాయి.