శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 28 నవంబరు 2019 (08:09 IST)

ఉగాదికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ళస్థలాలు: మంత్రి శ్రీరంగనాథరాజు

వచ్చే ఉగాది నాటికి కులం, మతం, జాతి వివక్ష అన్నది లేకుండా రాష్ట్రంలోని నిరుపేదలందరికీ సంతృప్తస్థాయిలో ఇళ్లు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో భాగమైన పేదలందరికీ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారన్నారు. ఇప్పటికే అర్హులైన లబ్ధిదారుల జాబితాలను రూపొందించడం జరిగిందని అన్నారు. నవరత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రానున్న నాలుగేళ్లలో 25 లక్షల పక్కాగృహాలను కూడా నిర్మించి ఇస్తామని తెలిపారు.

ఇప్పటికే పేదలకు ఇచ్చే భూమిని సేకరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రితో కలిసి 7 జిల్లాల్లో భూసేకరణ కోసం సమీక్షలు కూడా చేశామన్నారు.  త్వరలోనే మిగిలిన 6 జిల్లాల్లో కూడా పర్యటించి, భూసేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.

కేంద్రం నుంచి గతంలో 1.40 లక్షల ఇళ్ళు మంజూరు అయ్యాయని, ఈ రోజు మరో 2.58 లక్షల ఇళ్లు కేంద్రం ద్వారా తీసుకురావడం జరిగిందని అన్నారు. మొత్తం సుమారు 3.80 లక్షల ఇళ్ళ నిర్మాణానికి డిపిఆర్‌ పూర్తి అయ్యిందని మంత్రి వెల్లడించారు. మరో 4 లక్షల ఇళ్లు కూడా రాష్ట్రానికి కేటాయించేందుకు కేంద్రం సిద్దంగా ఉందని తెలిపారు.

గ్రామాల్లో సగటున ఒక్కో లబ్ధిదారుకు సెంటున్నర భూమి, పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమి కేటాయించి  పక్కా ఇళ్లు కట్టుకునేలా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇవాళ జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

అందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో కూడా భూమిని సేకరించేందుకు చర్యలు ముమ్మరం చేస్తున్నామని అన్నారు. అపార్ట్ మెంట్ లకు బదులుగా సొంత ఇల్లు కావాలంటూ ప్రజల నుంచి వస్తున్న అభ్యర్ధనలను దృష్టిలో పెట్టుకుని సెంటు భూమిని ఇచ్చి, దానిలో ఇళ్లు నిర్మించుకునేలా లబ్దిదారులకు చేయూతను అందించబోతున్నామన్నారు. ఇళ్లు నిర్మించుకోలేని నిరుపేదలకు పావలా వడ్డీకే బ్యాంకు ద్వారా రుణం కూడా అందించాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.

గతంలో మాదిరిగా కాకుండా ఇరవై రూపాయలు కట్టించుకుని లబ్దిదారులకు పట్టా ఇస్తున్నామని తెలిపారు. గతంలో స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ఆర్ ఇందిరమ్మ ఆదర్శ గ్రామాలతో పాటు అన్ని ప్రాంతాల నిరుపేదలకు 13 జిల్లాల్లో  24 లక్షల పక్కా గృహాలను నిర్మించి ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇదే 13 జిల్లాల్లో 25 లక్షల పక్కా గృహాలను నిర్మించాలని సంకల్పించారు.

పేదల ఇళ్ల కోసం దేవాదాయ భూములను తీసుకోవడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు. ఈ నాలుగేళ్లలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భాగస్వామ్యమై 50 వేల కోట్లతో 25 లక్షల ఇళ్లు కట్టబోతున్నామన్నారు. దీనితో రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల సంపద సృష్టించబడుతుందని వెల్లడించారు.

ఇప్పటికే సుమారు 7.86 లక్షల మంది లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు వున్నట్లుగా గుర్తించామని, వారికి పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. అర్హులందరికీ ఉగాది రోజున ఇళ్ల స్థలాలు, ప్లాట్ల కేటాయింపు పట్టాలు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు.  ఇళ్ల స్థలాల కోసం ఇప్పటికే గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా గ్రామం, పట్టణ వార్డులవారీగా దరఖాస్తులు స్వీకరించామని మంత్రి అన్నారు.

ఇళ్లస్థలాల కోసం అనువైన అన్ని రకాల ఖాళీ ప్రభుత్వ భూములను గుర్తించడం జరిగిందన్నారు. ప్రభుత్వ భూమి లభ్యత లేని చోట ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమిని కొనుగోలు చేస్తామని అన్నారు. దీనికి రెవెన్యూ రేటు నుంచి రెండున్నర రెట్ల వరకు చెల్లించి భూమిని కొనుగోలు చేస్తామన్నారు. అంతేకానీ రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేయడం జరగదని వెల్లడించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బలవంతపు భూసేకరణకు ఈ ప్రభుత్వం వ్యతిరేకమనే విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఈ భూసేకరణ, భూ అభివృద్ది కోసం సుమారు 11 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశామన్నారు. దీని కోసం ఆర్థిక మంత్రి కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు.

ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి స్పష్టం చేశారు.  రానున్న ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లను ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో అర్హుడు అనే వారు ఉండకుండా చేయాలన్నదే ముఖ్యమంత్రి నిర్ణయమని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను కూడా వాలంటీర్ల ద్వారా వెరిఫై చేయించి, అర్హులను గుర్తించామని తెలిపారు.

4.20 లక్షల మందిని అర్హులుగా గుర్తించి, వారికి బిల్లులు కూడా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే గత ప్రభుత్వం గృహనిర్మాణ శాఖకు సంబంధించి దాదాపు రూ.1020 కోట్ల నిధులను ఇతర పనులకు మళ్లించిందని అన్నారు. అందువల్ల గత ప్రభుత్వంలో ఇళ్లు మంజూరైన వారికి చెల్లింపులు జరగక లబ్దిదారులు ఇబ్బందుల పాలవుతున్నారని తెలిపారు.

వీరికి కూడా న్యాయం చేసేందుకు త్వరలోనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. ఈ బిల్లుల చెల్లింపులపై ఆర్థికశాఖ కూడా సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు. ఈరోజు జరిగిన కేంద్ర మంజూరు మరియు పర్యవేక్షణ కమిటీ (సీఎస్ఎంసీ) సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన మంత్రి ఆవాస యోజన పట్టణ గృహ నిర్మాణ పథకం కింద 2,58,648 గృహాలు మంజూరు అయినట్లు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు.

అందులోభాగంగా 57,629 గృహాలు పట్టణ ప్రాంతానికి సంబంధించినవి కాగా, 2,01,019 గృహాలు పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో మంజూరు అయ్యాయని మంత్రి పేర్కొన్నారు. ఈ గృహాల ప్రాజెక్టు విలువ రూ.7042.5 కోట్లని ఇందులో కేంద్రం వాటా రూ.3879.72 కోట్లు కాగా, రాష్ట్ర వాటా రూ.1581.39 కోట్లని మంత్రి వివరించారు.

2,58,648 లబ్దిదారుల్లో ఎస్సీలు 51,446, ఎస్టీలు 10,429, బీసీలు 1,50,665, మైనార్టీలు 19,683 మరియు ఇతరులు 46,108 ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. గత నెలలో మంజూరైన 1,24,624 ఇళ్లు కలుపుకుంటే తమ ప్రభుత్వం వచ్చాక 3,83,272 గృహాలు కేంద్ర నుంచి  పట్టణపేదలకు మంజూరు అయినట్లు మంత్రి స్పష్టం చేశారు.

రాబోయే నాలుగేళ్లలో గ్రామ మరియు పట్టణ ప్రాంతాల్లో కలిపి 25 లక్షల ఇళ్లు నిర్మించడానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి ప్రకటించారు.