ఉగాది నాటికి నిరుపేదలందరికీ ఉచిత ఇళ్ల స్థలాలు
ఉగాది నాటికి రాష్ట్రంలోని ఇళ్లు లేని నిరు పేదలందరికీ ఉచితంగా ఇళ్లపట్టాలు అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముందుకు సాగుతున్నారని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
రాష్ట్రంలో అర్హులైన ఏ ఒక్క నిరుపేద ఇళ్లు లేకుండా ఉండకూదనేదే ముఖ్యమంత్రి లక్ష్యమని మంత్రి తెలిపారు. సచివాలయంలోని ప్రచార విభాగంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.
స్థలం ఉండి ఇళ్లు లేని వారికి కూడా ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు చెప్పారు. వాలంటీర్ల ద్వారా సర్వే నిర్వహించి... పార్టీ, కులమతాలకతీతంగా అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు పట్టణ ప్రాంతాల్లో అవకాశం ఉన్నచోట పేదలకు అపార్ట్ మెంట్ తరహా ఇళ్లు కాకుండా.. వ్యక్తిగతంగా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించి వాటిలో ఇళ్లు కట్టించాలని అధికారులకు సీఎం సూచించారని మంత్రి తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం పేదలు ఉంటున్న ఫ్లాట్లలో నిర్వహణలోపంతో అపరిశుభ్ర పరిస్థితులు తలెత్తుతున్నాయని, అదే సమయంలో ప్లాట్లు కూడా దెబ్బతింటున్నాయని మంత్రి తెలిపారు. దీనికి పరిష్కారంగా పట్టణ ప్రాంతాల్లో అవకాశం ఉన్నచోట ఫ్లాట్ల స్థానంలో స్థలాలు ఇచ్చి, అక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించామన్నారు. ప్రస్తుతం సమస్యలు ఎదుర్కొంటున్న ఫ్లాట్లను బాగుచేసుకునేలా ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు.
పట్టణాల్లో ప్రాంతాల్లో అధిక సంఖ్యలో అక్రమ ఇళ్ల నిర్మాణాలు ఉన్నాయని.. అయితే వాటిలో అభ్యంతరంలేని అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజేషన్‌పై విధివిధానాలు తయారు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 2 సెంట్లలో నిర్మించిన అక్రమ కట్టడాలకు నామమాత్రపు ఫీజుకే రిజిస్ట్రేషన్ చేయనున్నామని, స్థల పరిమాణం 2 సెంట్లకు పైబడితే రెగ్యులరైజేషన్ ఫీజు ఎంత ఉండాలన్నదానిపై విధివిధానాలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
నదీతీరాల వెంబడి, కాల్వ గట్ల వెంబడి ఉన్న ఇళ్ల కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో వారికి ప్రభుత్వమే ఇళ్ల స్థలాలు కేటాయించి నిర్మాణం చేపట్టి అందించనున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో మాదిరిగా కాకుండా... స్థలం ఇచ్చిన వెంటనే లబ్ధిదారుల పేరిట ఇళ్ల స్థలం రిజిస్టర్ చేస్తామని తెలిపారు. ఇళ్ల నిర్మాణంకోసం వీలైనంతమేర ప్రభుత్వస్థలాలనే వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఇప్పటివరకూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 20,47,325 లబ్ధిదారులు ఉన్నారని, దీని కోసం రూరల్‌లో ఇప్పటివరకూ 19,389 ఎకరాలు గుర్తించగా.. ఇంకా రూరల్‌లో 8 వేల ఎకరాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
అర్బన్ ప్రాంతాల్లో 2,559 ఎకరాల గుర్తించగా.. ఇక్కడ ఇంకా 11వేల ఎకరాలు అవసరమవుతుందని అంచనాకు వచ్చినట్లు మంత్రి చెప్పారు. ఈ పథకం కోసం దాదాపు రూ.12 వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు.