గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2021 (11:24 IST)

జనసేన - బీజేపీ రూట్ మ్యాప్ పై చర్చ : పవన్ కళ్యాణ్

విశాఖ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణ అనేది రాష్ట్ర ప్రజల మనోభావాలు, ఎమోషన్స్ తో కూడుకున్న అంశంగా, ప్రత్యేకంగా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

మిగిలిన పరిశ్రమలతో పోలిస్తే విశాఖ ఉక్కు కర్మాగారం ఏ విధంగా ప్రత్యేకమైనదో కేంద్ర హోమ్ శాఖ మంత్రి  అమిత్ షాకి వివరించి.. ఈ కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని కోరామన్నారు.

మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా..  రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితులు, ఆలయాలపై దాడులు, ఆర్ధిక పరిస్థితులు, నివర్ తుపాను మూలంగా రాష్ట్ర రైతాంగం ఏ విధంగా నష్టపోయారు అనే అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు.

"విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశంపై అమిత్ షాతో చర్చించాం.  18 వేల మంది నేరుగా ఉపాధి తీసుకుంటూ ఉన్నారు. 20 వేల మందిపైగా కాంట్రాక్టు లేబర్ ఉన్నారు. లక్ష పైచిలుకు దీని మీద ఆదారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పునరాలోచన చేయాలని కోరడం జరిగింది.

మావంతుగా ఏమేమి చేయాలో తెలియచేశాం.  ప్రత్యేక పరిస్థితుల్లో దాదాపు 32 మంది బలిదానాల తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చింది. దీన్ని కేవలం ఉక్కు కర్మాగారంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకు మనోభావాలు, ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించి సూక్ష్మంగా చూడాలన్న అంశాన్ని కూడా నాయకులందరి దృష్టికి తీసుకువెళ్లాం.

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి మురళీధరన్ ని కూడా కలవడం జరిగింది. ఆయనతో చర్చ సందర్భంగా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశాన్ని ప్రస్తావించాం.ఈ అంశంతోపాటు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వివరించాం. దేవాలయాలపై దాడులు సాగుతున్నాయి. ఈ అంశాన్ని ప్రస్తావించాం. 
 
వచ్చే నెల 3, 4 తేదీల్లో అమిత్ షాని వారి తిరుపతి పర్యటనలో మరోసారి కలిసి చర్చిస్తాం. జనసేన - బీజేపీల రూట్ మ్యాప్ ఎలా ఉండాలి.. ఎన్నికల వరకూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశం మీద కోర్ కమిటీలో చర్చిద్దామని అమిత్ షా తెలిపారు. శాంతి భద్రతల మీద చాలా దృష్టి ఉంది. వీటన్నింటి మీద లోతుగా మాట్లాడేందుకు వచ్చే నెలలో దానిపై చర్చిస్తాం. 

స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ రాత్రికి రాత్రి ఆయన తీసుకున్న నిర్ణయం కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా జరుగుతోంది. కానీ ఇప్పుడు ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పునరాలోచించమని చెప్పాం. ఈ అంశంపై వైసీపీ మనస్ఫూర్తిగా పని చేయాలి అనుకుంటే సాధ్యపడుతుంది. వారు చేయకూడదు అనుకుంటే మనమేం చేయలేం.

ఇంత దూరం మేము వచ్చి కలిసి కేంద్రానికి విజ్ఞాపన ఇచ్చినప్పుడు 22 మంది ఎంపిలు ఉన్న వైసీపీ చాలా చేయొచ్చు. తిరుపతి ఉప ఎన్నిక విషయంలో కూడా వచ్చే నెల 3, 4 తేదీల్లో అమిత్ షా గారి తిరుపతి పర్యటనలో చర్చించాక స్పష్టమైన రోడ్ మ్యాప్ వస్తుంది" అన్నారు.  

'కొరియా కంపెనీతో ఒప్పందం జరిగినప్పుడు లెటర్ ఎందుకు రాశారు? ఒప్పందం జరిగింది అని వైసీపీ నేతలు అంటున్నప్పుడు ప్రత్యేకించి జగన్ రెడ్డి లెటర్ రాయడంలో అంతర్యం ఏంటి?  మా కార్యకర్తలు చాలా రోజుల నుంచి ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. బీజేపీ కేడర్ కూడా పాల్గొంటున్నారు' అని అన్నారు. 

షర్మిల పార్టీ ఏర్పాటుపై మరో విలేకరి ప్రశ్నించగా 'పార్టీ ఫామ్ చేసి వారి విధి విధానాలు చూసిన తర్వాత స్పందిద్దాం. ప్రతి ఒక్కరికీ రాజకీయాల్లోకి వచ్చే హక్కు ఉంది. వారి విధివిధానాలు వచ్చాక స్పష్టత తీసుకుందాం. కేసీఆర్ పరిపాలనపై నేను హైదరాబాద్ లో మాట్లాడుతా' ప్రత్యుత్తరమిచ్చారు.

రాష్ట్ర అప్పుల గురించి అడిగిన ప్రశ్నకు ఆర్ధిక వ్యవస్థపై వారికి అవగాహన ఉంది కాబట్టి, వారి చేతుల్లో ఉంది కాబట్టి వారు వివరిస్తే బాగుంటుంది అన్నారు.