శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (13:25 IST)

చంద్రబాబు రియల్ టైమ్ గవర్నెన్స్ భేష్... జపాన్ మంత్రి కితాబు

రియల్ టైమ్ గవర్నెన్స్ విషయంలో కొన్ని అంశాలు జపాన్ దేశాన్ని మించి నిర్వహిస్తున్నారని జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖ ఉప ముఖ్యమంత్రి సాయిసకు కిరాకి తెలిపారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్సును ఆయన నేతృత్వంలోని జపాన్ ప్రతినిధుల బృందం సందర్శించింది

రియల్ టైమ్ గవర్నెన్స్ విషయంలో కొన్ని అంశాలు జపాన్ దేశాన్ని మించి నిర్వహిస్తున్నారని జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖ ఉప ముఖ్యమంత్రి సాయిసకు కిరాకి తెలిపారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్సును ఆయన నేతృత్వంలోని జపాన్ ప్రతినిధుల బృందం సందర్శించింది. రియల్ టైమ్ గవర్నెన్స్ డైరెక్టర్ బాలాజీ ఆదివిష్ణు ఈ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. రియల్ టైమ్ గవర్నెన్స్ పనితీరు గురించి వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ఆరంభించిన రియల్ టైమ్ గవర్నెన్స్ ఇప్పటికే ప్రజాదరణ పొందుతోందన్నారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు మెరుగైన, పారదర్శక పాలన అందించాలనే ఆశయంతో వినూత్నంగా ఈ వ్యవస్థకు రూపకల్పన చేశారని తెలిపారు. సమర్థ పాలన అందించడానికి టెక్నాలజీని ప్రభుత్వం రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. పరిష్కార వేదిక 1100 కాల్ సెంటర్ ద్వారా ప్రజల నుంచి రోజూ కొన్నివేల ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరిస్తున్నామని తెలిపారు. 
 
ఇప్పటికే 1.40 కోట్ల ఫిర్యాదులను పరిష్కరించామని తెలియజేశారు. పాలనలో పెద్దఎత్తున టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు తెలిపారు. పది లక్షల ఐఓడీ డివైజులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పట్ల ప్రజల సంతృప్తి స్థాయిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా ప్రస్తుతం 65 శాతం సంతృప్తి సాధించినట్లు, అంతిమంగా 80 శాతాన్ని మించి సంతృప్తిని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.
 
చాలా బాగుంది... 
రియల్ టైమ్ గవర్నెన్స్ పనితీరును పరిశీలించిన అనంతరం జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖ ఉపముఖ్యమంత్రి సాయిసకు కిరాకి మాట్లాడుతూ... రియల్ టైమ్ గవర్నెన్స్ అద్భుతంగా వుందని వ్యాఖ్యానించారు. కొన్ని అంశాలు చూస్తుంటే జపాన్ దేశం కంటే మీరు చాలా మెరుగ్గా పనిచేస్తున్నారనీ, అది తనకెంతో సంతోషంగా వుందన్నారు. ముఖ్యంగా డేటా విశ్లేషణ, దాన్ని భద్రపరచడంలో తీసుకుంటున్న జాగ్రత్తలు తమకు ఎంతగానో సంతృప్తి కలిగించిందని అన్నారు. 
 
రియల్ టైమ్ విషయంలో ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సేవలు అద్భుతంగా వున్నాయనీ, ఇలాంటి వినూత్న ఆలోచనలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. మంత్రి సాయిసకు కిరాకి వెంట వచ్చిన మరో 14 మంది ప్రతినిధులు కూడా రియల్ టైమ్ గవర్నెన్స్ పనితీరు గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.