సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 జనవరి 2020 (16:08 IST)

తల నరికి ఒకచోట.. మొండేన్ని మరో చోట పెడతానంటున్న జగన్ : జేసీ

వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మరోమారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజధాని తరలింపు నిర్ణయం పిచ్చితుగ్లక్‌ తరహాలో తీసుకున్న నిర్ణయమని అన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, మనిషి శరీరానికి తల ఎంత ముఖ్యమో... రాష్ట్రానికి రాజధానికి కూడా అంతే ముఖ్యమన్నారు. కానీ, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తల నరికి ఒక చోట.. మొండేన్ని మరో చోట పెడతానని అంటున్నాడని ఎద్దేవా చేశారు. పైగా, తెలివి ఒక్కడి సొత్తు అనుకోవద్దనీ, ప్రతి ఒక్కరికీ ఉంటుందనే విషయాన్ని జగన్ గుర్తించుకోవాలని సలహా ఇచ్చారు. 
 
వాస్తవానికి రాజధాని అమరావతి అంటేనే దూరం అనుకున్నాం. కానీ, ఐదు కోట్ల మంది ప్రజలకు కేంద్రంగా ఉంటుందని తామంతా అమరావతికి మద్దతు పలికామన్నారు. ఇపుడు అమరావతి కాదని వైజాగ్ తీసుకెళ్ళతామంటే తాము ఎంతమాత్రం సహించబోమన్నారు. ఎందుకంటే.. అమరావతి కంటే వైజాగ్ చాలా దూరమని, అక్కడకు వెళ్లాలంటే రెండు రోజుల పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ కాదుగీదు అంటే గ్రేటర్ రాయలసీమ కోసం ఉద్యమించడం ఖాయమని జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు.