సీఎం జగన్‌కి కె.ఎ పాల్ శాపాలు
ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్. క్రిస్మస్ వేడుకలు జగన్ జరుపుకోవచ్చు.. కానీ మేము చేసుకోకూడదా అంటూ ప్రశ్నించారు. ఇలా చేస్తే సర్వనాశనం కావడం ఖాయమంటూ శాపాలు పెట్టారు కె.ఎ.పాల్.
వైజాగ్‌లో ఈ నెల 24వ తేదీ నుంచి క్రిస్మస్ వేడుకలను జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు కె.ఎ.పాల్. స్టిక్టర్లు, హోర్డింగులను ఏర్పాటు చేయడమే కాకుండా సభ కోసం స్థలాన్ని చూసుకుని అందులో చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ఆంక్షలను క్రిస్మస్ వేడుకలపై విధించింది. రోడ్లపైన బహిరంగ సభలు పెట్టడం.. హడావిడి చేయడం లాంటివి చేయకూడదంటూ షరతులను విధించింది. అయితే కె.ఎ.పాల్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా కార్యక్రమానికి సిద్థమయ్యారు.
దీంతో విశాఖ నగర పాలకసంస్థ అధికారులు నేరుగా పాల్ ఏర్పాటు చేస్తున్న సభాస్థలికి చేరుకుని హోర్డింగులు, బ్యానర్లను ఎత్తుకెళ్ళారు. కె.ఎ.పాల్ వాహనాన్ని కూడా తీసుకెళ్లిపోయారు. దీంతో పోలీసుల వైఖరితో మండిపడ్డ కె.ఎ.పాల్ సిఎం జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేయిస్తున్నారని మండిపడ్డారు.