మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (21:38 IST)

మంత్రి పదవి రాలేదని బోరున విలపించిన కోటంరెడ్డి - మాచర్లలో నిరసన జ్వాలలు

kotamreddy
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. పాత మంత్రుల్లో 11 మందికి మళ్లీ అవకాశం కల్పించారు. మిగిలిన వారందరూ కొత్తవారు. అయితే, ఈ మంత్రివర్గంలో తమకు మంత్రి పదవి వస్తుందని అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. అలాంటివారిలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. మంత్రి పదవి వస్తుందని కోటి ఆశలు పెట్టుకున్నారు. 
 
కానీ ఆదివారం ప్రకటించిన మంత్రివర్గ జాబితాలో కోటంరెడ్డి పేరు లేదు. దీంతో ఆయన కన్నీరు పెట్టుకున్నారు. తనకు మంత్రి పదవి దక్కలేదని, వైకాపా నేతలు, కార్పొరేటర్లు ఎవరూ రాజీనామాలు చేయొద్దని సూచించారు. వైకాపా కార్యకర్తలు, నేతలు తమ రక్తాన్నే చెమటగా మార్చి తనను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్నానని తెలిపారు. అందుకే ఆయన మంత్రిపదవి రాలేదన్న బాధ తనకు ఉందని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 
 
మరోవైపు, పల్నాడులో నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. నాలుగు పర్యాయాలుగా వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన అనుచరగణం ఆగ్రహావేశాలను వ్యక్తం చేసింది. పదవులకు రాజీనామాలు చేస్తామంటూ మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ కిషోర్‌తో పాటు పెద్ద సంఖ్యలో వైకాపా ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చారు. వారు రోడ్లపైకి వచ్చిన దుకాణాలు బంద్ చేయించి, టైర్లు, మోటార్ బైకులకు నిప్పంటించారు. దీంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు కొత్త మంత్రివర్గ జాబితాలో తన పేరు లేదని తెలుసుకున్న పిన్నెల్లి తన నివాసానికే పరిమితమయ్యారు.