పాత తరం రాజకీయాల్లో ధర్మరాజు లాంటి నేతలుండేవారు. కానీ, ఈ తరం రాజకీయాల్లో ఎం.ధర్మరాజ్, ఎం.ఏ.లు ఎక్కువైపోయారు. అంచులో కూర్చోనిస్తూ... నిదానంగా జరుగుకుంటూ... కుర్చీ అంతా ఆక్రమిం చేసి, ఆశ్రయం ఇచ్చిన వారికి, పైకి తెచ్చిన వారికి హ్యాండ్ ఇచ్చే బాపతును... ఎం.ధర్మరాజ్, ఎం.ఏ అంటారు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమా ఎం.ధర్మరాజ్, ఎం.ఏ. అందులో అనుచరుడిగా ఉన్న మోహన్ బాబు పబ్లిసిటీతో అంచెలంచెలుగా ఎదిగి, కాకలు తీరిన కైకాల సత్యన్నారాయణను కిందపడేస్తాడు. తాను ఎదిగిన విధానాన్ని కూడా మరిచిపోయి, నిఖార్సయిన రాజకీయ నాయకుడిలా డైలాగ్స్ వల్లె వేస్తాడు.
సరిగ్గా...ఇలాగే, నందిగామ నియోజకవర్గ స్థాయి నాయకుడు తన నిఖార్సయిన లోపలి భావాల్ని బయటపెడుతున్నారు. తనను పెంచి పోషించిన మీడియాను సైతం విస్మరించి, అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఉదయం లేస్తే, నేటి రాజకీయ నేతలకు మీడియా కావాలి. వారు చేసిన పనులకు పత్రికల ప్రచారం కావాలి. చేయని పనులకు మీడియా మేనేజ్ మెంట్ కావాలి. తీరా అదే మీడియా ఎదురుపడితే, అసహనం. ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు, ఎన్నికలయిపోయాక విలేకరులతో పనేముందని అనుకుంటారేమో గాని, కొందరు నేతలు, తమ విచిత్ర ప్రవర్తనతో అసలు నైజాన్ని చాటుతుంటారు.
ఇందులో ఒకడుగు ముందుకేసిన ఆ నియోజకవర్గం నేత... అసలు ఈ మీడియా వాళ్ళు, వాళ్ళడిగే ప్రకటనలతో... రాజకీయాల నుంచే తప్పుకోవాలనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. సదరు నేత మాటలకు అంతా ఔరా అని మక్కున వేలేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కరోనా సమయంలోనూ ఫ్రంట్ లైన్ వారియర్స్ లా పనిచేసిన పాత్రికేయులకు ఆధారం పత్రిక. ఆ పత్రిక నడవాలంటే, పాఠకుల ఆదరణతోపాటు ప్రకటనలు కూడా అత్యవసరం. అవి లేకుంటే పత్రికలు మనజాలవు. ఈ చిన్న విషయాన్ని కూడా గ్రహించలేని నేతలు, తమ ప్రతి అవసరానికి పత్రికలను, పాత్రికేయులను వినియోగించుకోవడం పరిపాటి అయిపోయింది. కానీ, ఆ పత్రికలను ఆదరించే విషయానికి వస్తే, ఆరడుగులు వెనక్కి వేస్తున్నారు.
కరోనా కష్ట కాలంలో వ్యాపారాలు సరిగా లేక, పత్రికలకు ప్రయివేటు ప్రకటనల ఆదాయం పూర్తిగా పడిపోయింది. ప్రభుత్వం నుంచి కూడా చిన్న పత్రికలకు తోడ్పాటు కూడా కరవైంది. ఇలాంటి సమయంలో తమ సంస్థల మనుగడే ప్రశ్నార్ధకంగా మారి, పాత్రికేయులు మీడియాసంస్థలను కాపాడుకోవడానికి నేతలను ప్రకటనల కోసం ఆశ్రయించడం సర్వసాధారణమైంది. దీనిని సహృదయంతో అర్ధం చేసుకుని, ప్రకటన ఇవ్వకపోయినా ఫరవాలేదు, ఒకింత ప్రోత్సాహం అందిచాల్సిన నేతలు... అసలు మీడియా వారిని చూస్తేనే కస్సు బుస్సులాడటం చూస్తే, అవసరం తీరాక... ఇంతేలే అనే భావం కలుగుతుంది.
అయితే, అసలు ఈ మీడియా, పత్రికలు యాడ్స్ కోసం, ఏకంగా రాజకీయాల నుంచి పక్కకు తొలగిపోవాలనిపిస్తుందని, ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడి అసహనం పాత్రికేయులకు అనూహ్య స్పందన. పత్రికలు పనిచేసేది సమాజ హితం కోసం అని గ్రహించిన నాడు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అని గుర్తెరిగిన నాడు, ఒడిగడుతున్న పత్రికలకు కాస్త ఒత్తి వేసి, వెలుగు పంచే ఆపన్న హస్తాల కోసం పాత్రికేయ రంగం వేచిచూడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.