మంగళగిరిలో వైకాపాకు షాక్ - స్పీకర్- మంత్రులకు చుక్కెదురు
ఏపీలో ఆదివారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో అధికార వైపాకా ఏకపక్షంగా విజయాన్ని నమోదుచేసుకుంది. అయితే, గుంటూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్ నివాసం ఉంటున్న మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి దిమ్మతిరిగే ఫలితం వచ్చింది.
పోటీ చేసిన 18 స్థానాల్లో కేవలం 7 చోట్ల మాత్రమే వైసీపీ విజయం సాధించింది. దుగ్గిరాల మండలంలో పోటీ చేసిన 14 స్థానాల్లో 9 చోట్ల టీడీపీ ఘన విజయం సాధించింది. రెండు చోట్ల జనసేన పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
మరోవైపు, ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ స్వగ్రామం తొగరాంలో ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. ఆమదాలవలస మండలం తొగరాం, కలివరం ఎంపీటీసీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేసిన తమ్మినేని భారతమ్మ విజయం సాధించారు. స్పీకర్ సీతారామ్‌కు భారతమ్మ వదిన కావడం గమనార్హం.
అలాగే, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సొంత నియోజకవర్గంలో 17 ఎంపీటీసీ స్థానాలకు పోటీ జరగ్గా.. ఏడింటిని టీడీపీ గెలుచుకుంది.
అలాగే, మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంటలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆచంట మండలంలో టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకుని 17 ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేశాయి. వీటిలో టీడీపీ 7, జనసేన 4 స్థానాలను దక్కించుకోగా.. వైసీపీ 6 స్థానాలకే పరిమితమైంది.