నిమ్మగడ్డపై మరో సభాహక్కుల నోటీసు : స్పీకర్‌కు మంత్రి నాని ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై మరో సభా హక్కుల నోటీసును ఇచ్చేందుకు అధికార వైకాపాకు చెందిన మంత్రి కొడాలి నాని సిద్ధమయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఆయన ఫిర్యాదు చేయనున్నారు.
మంత్రి కొడాలి నాని పట్ల రమేశ్‌కుమార్ వ్యవహరించిన తీరు సభ్యుని హక్కులకు భంగం కలిగించే రీతిలో ఉ న్నాయని వైసీపీ భావిస్తోంది. ఆ మేరకు శాసన సభాపతికి మంత్రి నాని ఫిర్యాదు చేయనున్నారు.
మరోవైపు కొడాలి నానికి ఎస్‌సీఈ ఇచ్చిన నోటీసు, ఎన్నికల ప్రవర్తనాని యమావళిని ఉల్లంఘించినందున చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కృష్ణా జిల్లా ఎస్పీకీ ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించాలని వైసీపీఎల్పీ తీర్మానించింది. హైకోర్టు ఆదేశాలు వచ్చేలోగా.. ఎస్‌ఈసీ నోటీసులు, ఎస్పీకి ఇచ్చిన ఆదేశాలపై వైసీపీఎల్పీ ఫిర్యాదును సిద్ధం చేసింది.
హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సభాపతికి పంపే ఫిర్యాదులో మార్పులూ చేర్పులూ చేయాలని వైసీపీఎల్పీ భావిస్తోంది. ఇప్పటికే తమ హక్కులకు భంగం కలిగించేరీతిలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వ్యవహరించారం టూ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే.
ఈ ఫిర్యాదు మేరకు.. ఎస్‌ఈసీపై చర్యలు తీసుకోవడంపై పరిశీలన చేయాలంటూ సభాహక్కుల సంఘాన్ని సభాపతి ఆదేశించారు. కొత్తగా.. ఆ జాబితాలో మంత్రి కొడాలి నాని చేరారు. ఆయన కూడా.. ఎస్‌ఈసీపై హక్కుల నోటీసునుఇస్తే .. ముచ్చటగా మూడో మంత్రి అవుతారు.