సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2021 (21:39 IST)

మంత్రి కొడాలి నాని స్వగ్రామంలో టీడీపీ అభ్యర్థి జయకేతనం

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేత కొడాలి నానికి చుక్కెదురైంది. మంత్రి కొడాలి నాని స్వగ్రామంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి ఘన విజయం సాధించారు. కొడాలి నాని స్వగ్రామం గుడివాడ నియోజకవర్గం పామర్రు మండలం యలమర్రు గ్రామం. ఈ గ్రామం సర్పంచ్‌గా టీడీపీ అభ్యర్థి కొల్లూరి అనూష 800 ఓట్లతో భారీ విజయం సాధించారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. 
 
తమ పార్టీ నేతలను మంత్రి కొడాలి నాని బూతులు తిట్టడాన్ని యలమర్రు గ్రామస్థులు జీర్ణించుకోలేకపోయారని, దీంతో కొడాలి నాని బలపర్చిన అభ్యర్థిని దారుణంగా ఓడించారని స్థానిక టీడీపీ నేతలు అన్నారు. ఈ విజయం చూసైనా కొడాలి తీరు మారాలని సూచించారు.
 
మరోవైపు గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలో 20 పంచాయతీలకు గాను తొమ్మిది గ్రామాల సర్పంచ్‌లుగా టీడీపీ మద్దతు అభ్యర్థుల విజయం సాధించారు. పలు గ్రామాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 
మేజర్ గ్రామ పంచాయతీల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వగ్రామంలోనూ టీడీపీ అభ్యర్థి గెలిచారు. రామచంద్రాపురం నియోజకవర్గం హసన్‌బాదలో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ మద్దతుదారుడు నాగిరెడ్డి సతీష్ రావు 208 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా విజయం సాధించారు.