గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (07:58 IST)

వైకాపా ఓట్లు వేయకుంటే పథకాలు కట్.. ఆ బాధ్యత వలంటీర్లదే : జోగి రమేష్

పంచాయతీ ఎన్నికల్లో వైకాపా బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు వేయకుంటే ప్రభుత్వం అందించే సక్షేమ పథకాలను కట్ చేస్తామని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ హెచ్చరించారు. పైగా, ప్రతి గ్రామంలోని ప్రజలతో వైకాపాకు ఓట్లు వేయించే బాధ్యత వలంటీర్లదే అని ఆయన అన్నారు. 
 
కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం నీలిపూడి, చినపాండ్రాక, నిడమర్రు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీకి ఓటేయనని ఎవరైనా ఎదురుతిరిగితే 17 తర్వాత బాధపడతారని హెచ్చరించారు. '17న ఎన్నికలు అయిపోతాయి. నిమ్మగడ్డ సర్దుకుని వెళ్లిపోతారు. చంద్రబాబు గురించి చెప్పక్కరలేదు. తొలివిడత చూశారుగా, వార్‌ వన్‌సైడ్‌. ఆలోచించుకుని ఓటేయండి' అని ఓటర్లను హెచ్చరించారు. 
 
వైసీపీకి ఓట్లేయించే బాధ్యత వలంటీర్లు తీసుకోవాలన్నారు. 50 ఇళ్లకు ఒక వలంటీరును నియమించామని, ఆయా ఇళ్లవారితో వైసీపీకి ఓటు వేయించాల్సిన బాధ్యత వలంటీర్లదేనని స్పష్టంచేశారు. ఎన్నికల కమిషనర్‌ ఉన్నా తనకేం భయం లేదని.. ఇవే మాటలు చెబుతానన్నారు. అంగన్‌వాడీ అక్కలు, వలంటీర్లు అందరూ బాధ్యతగా తీసుకుని వైసీపీకి ఓట్లేయించాలని జోగి రమేశ్‌ ఆదేశించారు. 
 
అంతేకాకుండా, 'ఎవరైనా వేరే పార్టీ తరపున వార్డు సభ్యునిగా నిలబడితే వాళ్ల ఇంట్లో వాళ్లకు ప్రభుత్వ పథకాలు కట్‌ చేస్తా.. మన పథకాలు తీసుకుంటూ జగనన్న పథకాలు తీసుకుంటూ మనకు వ్యతిరేకంగా నిలబడితే వాళ్ల ఇంట్లో ఉన్న పింఛన్‌, కాపునేస్తం, అమ్మఒడి ప్రతి ఒక్కటీ కట్‌ చేసి పడేస్తా. సమస్యే లేదు.. మొహమాటం కూడా లేదు' అని ఎమ్మెల్యే జోగి రమేశ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.