నోటి దురుసుకు తగిన మూల్యం చెల్లించుకున్న వైకాపా ఎమ్మెల్యే!

kannababu
ఠాగూర్| Last Updated: బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (10:13 IST)
విశాఖపట్టణం జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుకు తగిన శాస్తి జరిగింది. తన నోటి దురుసుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. మంగళవారం జరిగిన తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో యలమంజలి నియోజకవర్గ పరిధిలోని అత్యధిక పంచాయతీల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించినా... కొన్నిచోట్ల ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.

రాంబిల్లి మండలం రాజకోడూరులో ఎమ్మెల్యే బలపరిచిన చిరంజీవిపై వైసీపీ తిరుగుబాటు అభ్యర్థి ముత్తా శంకరరావు విజయం సాధించారు. ఇక్కడ పది వార్డులకు తొమ్మిది వార్డులు శంకరరావు వర్గీయులు కైవసం చేసుకోవడం గమనార్హం. నాలుగు రోజుల క్రితం ఈ గ్రామంలో ఎమ్మెల్యే కన్నబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఆ సమయంలో ఎమ్మెల్యే కన్నబాబు తనదైన శైలిలో బెదిరించారు. తాను సూచించిన వ్యక్తినే సర్పంచ్‌గా గెలిపించాలని, ఒకవేళ ప్రత్యర్థి గెలిచినా పంచాయతీ కుర్చీలో కూర్చొనివ్వబోనని, నేలపైనే కూర్చోవాలంటూ హెచ్చరిక చేశారు.

ఇదే తరహాలో వెల్చూరు పంచాయతీ వీఆర్‌ అగ్రహారంలో బెదిరించారు. అయితే వెల్చూరులో కన్నబాబు బలపరిచిన అనకాపల్లి సీతపై ప్రత్యర్థి వర్గానికి చెందిన కిల్లాడ మంగాయమ్మ విజయం సాధించారు. మునగపాక మండలంలో ఇప్పటివరకు నాగవరం, ఆనందపురం, మూలపేట, అరబుపాలెం, రాజుపేట, గంటవాని పాలెంలో గవర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్‌ వర్గీయులు విజయం సాధించి ఎమ్మెల్యేకు షాక్‌ ఇచ్చారు. మునగపాకలో 14 వార్డులను ప్రసాద్‌ వర్గీయులు కైవసం చేసుకున్నారు.దీనిపై మరింత చదవండి :