శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (19:12 IST)

పంచాయతీ ఎన్నికలు అలా నిర్వహించాలి.. ఏ. వెంకటరమణ

పంచాయతీ ఎన్నికలు నిజాయితీగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రిసైడిగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ప్రవర్తనా నియమావళిని అనుసరిస్తూ విధులు నిర్వహించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి ఏ. వెంకటరమణ అన్నారు.
 
సోమవారం స్థానిక కేటీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో గుడివాడ రూరల్ మండలంలో ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని యంపీడీవో వెంకటరమణ అధ్యక్షతన జరిగింది. 
 
ఈ సందర్భంగా యంపీడీవో వెంకటరమణ మాట్లాడుతూ గుడివాడ మండలంలో ఫిబ్రవరి 13వతేదీ నిర్వహించే గ్రామ పంచాయితీ సర్పంచ్, వార్డు మెంబర్లు ఎన్నకల ఓటింగ్, కౌంటింగ్ ప్రక్రియలకు సంబందించి పీఓ, ఏపీఓలు, సిబ్బందికి శిక్షణను అందించామన్నారు. 
 
ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలింగ్ మొదలుకొని కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ ఈ శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాని కోరారు. 
 
బ్యాలెట్ బాక్సులు వినియోగం, అనంతరం వాటిని భద్రపరిచే విధానం, చెల్లని ఓట్లు వంటి విషయాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు. పోలింగ్, కౌటింగ్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో ముందుకానే తెలుసుకోవాలన్నారు. పోలింగ్ రోజు 13 వ తేదీ ఉదయం 5 గంటలకే తమకు నిర్థేశించిన పోలింగ్ కేంద్రాల్లో ఉండాలన్నారు. ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలని సూచించారు. 
 
పోలింగ్ విధులు నిర్వహించే ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన గ్రామానికి సంబందించి పోటీలో ఉన్న అభ్యర్థుల బ్యాలెట్ పేపర్లును, ఒకటికి రెండు సార్లు చూసుకొని తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఆ గ్రామానికి సంబందించి ఓటర్ల జాబితా ప్రాతిపధికన ఎన్ని బ్యాలెట్ బాక్సులు అవసరమో అన్నీ తీసుకెళ్ళాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలు, కౌటింగ్ కేంద్రాలకు బ్యాలెంట్ బాక్సులను చేరవేసేసమయంలో పోలీసు బందోబస్తు, వీడియోకెమేర చిత్రీకరణ తప్పనిసరిగా ఉంటుందన్నారు. 
 
సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన  గ్రామాల్లో పోలీసు బందోబస్తు, వీడియో చిత్రీకరణ  చేస్తున్నామన్నారు.  కౌంటింగ్ ప్రక్రియకు సంబందించి ఆయా పంచాయితీ వార్డుల ప్రకారం ఎన్ని టేబుల్స్ అవసమో, ఏజెంట్లు కూర్చునేందుకు కావలసిన చైర్లు ముందుగానే సిద్దం చేసుకోవాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది కోవిడ్-19 నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు.
 
సర్పంచ్, వార్డుమెంబర్ల  కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తదుపరి  గెలుపొందిన అభ్యర్థులకు ధృవీకర పత్రాన్ని అందించాలన్నారు. అనంతరం ఆయా గ్రామ పంచాయితీల్లో  నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు మెంబర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని యంపీడీవో వెంకటరమణ అన్నారు.
 శిక్షణా కార్యక్రమంలో డిఎల్ పీవో ఇన్ఛార్జి నాగిరెడ్డి, శిక్షణాబోధకులు ఏఎస్ఓ ప్రసాద్, ఇవోపీఆర్డీ డి. వెంకటేశ్వరరావు, పీవో, ఏపీవోలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.