శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (15:25 IST)

నేనో మూర్ఖుడిని.. దేవుడు చెప్పినా వినను.. టీడీపీ అభ్యర్థి గెలిచినా.. నేలపై కూర్చోవాల్సిందే.

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో అధికార వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రత్యర్థి అభ్యర్థులతో పాటు.. ప్రజలను బెదిరిస్తూ, తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వైజాగ్ జిల్లా యలమంచిలి వైకాపా ఎమ్మెల్యే కన్నబాబు మరోమారు నోటికి పనిచెప్పారు. తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. మా పార్టీ అభ్యర్థిని గెలిపించకపోతే అభివృద్ధి బంద్ చేస్తానంటూ హెచ్చరించారు. 
 
ఇప్పటికే ఆయన బెదిరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా రాంబిల్లి మండలం రాజకోడూరు పంచాయతీ ఎన్నికల ప్రచార సభలో ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు గ్రామస్థులకు ఓ హెచ్చరిక జారీచేశారు.
 
'సర్పంచ్‌గా వైసీపీ అభ్యర్థిని గెలిపించాల్సిందే. మీకందరికీ క్లియర్‌గా చెబుతున్నా... తేడా వస్తే మీ ఊరికి రోడ్లు, కొళాయిలు, పైప్‌లైన్లు ఏమీ ఉండవు. నిర్మాణంలో వున్న సచివాలయం పనులు నిలిచిపోతాయి. నేను ఎంత మంచివాడ్నో, అంత మూర్ఖుడ్ని. 
 
సీఎం తర్వాత నియోజకవర్గంలో ఎవరికీ ఏది ఇవ్వాలన్నా నేనే. పనుల కోసం, పథకాల కోసం నా చుట్టూ ఊరు ఊరంతా కాళ్లరిగేలా తిరిగినా ఫలితం ఉండదు. గెలిచినా, ఓడినా ఐదేళ్లు సర్పంచ్‌ మా వాడే. అవతలి వ్యక్తి గెలిచినా కూర్చోవడానికి కుర్చీ కూడా ఉండదు. నేలపైనే కూర్చోవాల్సి ఉంటుంది. దేవుడు చెప్పినా వినను'
 
టీడీపీకి చెందిన ఆంజనేయరెడ్డి, శంకరరావులకు నరకం అంటే ఎలా వుంటుందో చూపిస్తానని, అందులో అనుమానం లేదన్నారు. ‘అందరికీ ప్రభుత్వ పట్టాలు అందేశాయి అనుకుంటున్నారేమో.... తేడా చేస్తే తర్వాత రావాల్సినవేవీ అందవు’ అంటూ హెచ్చరించారు. 
 
గత ఎన్నికల్లో పంచకర్ల రమేష్‌బాబు, పప్పల చలపతిరావు, బొడ్డేడ ప్రసాద్‌... ఇలా ఎందరు కలిసినా తన వెంట్రుక పీకలేకపోయారని, దీనిని గుర్తుపెట్టుకుని పంచాయతీ ఎన్నికల్లో ఓటేయకపోతే తర్వాత మీ ఇష్టమంటూ ప్రసంగాన్ని ముగించారు.