గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (16:51 IST)

త్వ‌ర‌లో ఎస్‌.పి.బాలు విగ్ర‌హం కొడాలి నాని ఆవిష్క‌ర‌ణ‌

Kodalai nani, Gudivada
పద్మశ్రీ , పద్మభూషణ్, పద్మ విభూషణ్, డాక్టర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం (బాలు ) విగ్రహాన్ని మొదటగా గుడివాడ పట్టణంలో నెలకొల్పడం అభినందనీయమని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) అన్నారు. స్థానిక రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని కళాకారుల సమాఖ్య అధ్యక్షుడు బీ రామమోహనరెడ్డి , కోశాధికారి విన్నకోట సత్యనారాయణ ( పద్మ మైక్ బుజ్జి ) , సభ్యులు లంకపల్లి ప్రకాష్ , బీవీ సత్యం , పీ శ్యామ్ తదితరులు కలిశారు .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గుడివాడ పట్టణం రాజబాపయ్యచౌక్ లోని అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహం దగ్గర ఎస్పీ బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. బొమ్మినంపాడుకు చెందిన ప్రఖ్యాత శిల్పి అప్పారావు ఈ విగ్రహానికి రూపకల్పన చేశారన్నారు. ఈ నెల 11 వ తేదీ ఉదయం 11 గంటలకు జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలంటూ మంత్రి కొడాలి నానిని ఆహ్వానించారు.

ఎస్పీ బాలు సుదీర్ఘ ప్రస్థానంలో ఆరు జాతీయ, ఆరు ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని, 25 సార్లు ఉత్తమ జాతీయ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలను అందుకున్నారన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక పురస్కారాలను అందజేశాయన్నారు. ఎంతో మంది నూతన గాయనీ గాయకులను కళారంగానికి పరిచయం చేసిన ఎస్పీ బాలు విగ్రహాన్ని సమాఖ్య ఆధ్వర్యంలో నెలకొల్పుతున్నట్టు చెప్పారు.

అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ కళాకారులకు పుట్టినిల్లు గుడివాడలో ఎస్పీ బాలు విగ్రహాన్ని తన చేతులమీదుగా ఆవిష్కరించే అదృష్టం రావడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో దాదాపు 40 వేలకు పైగా పాటలను పాడి ఘంటసాల లేనిలోటు తీర్చిన మహాగాయకుడు ఎస్పీ బాలు అని అన్నారు. ఎస్పీ బాలు గాయకుడిగానే పరిమితం కాకుండా నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా బహుముఖ సేవలందించారన్నారు.

అటువంటి కళాకారుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న కళాకారుల సమాఖ్య నేతలను అభినందించారు. గుడివాడ ప్రాంతం నుండి ఎందరో కళాకారులు నాటక, సినీరంగాల్లో రాణి ప్రపంచస్థాయి ఖ్యాతినార్జించారన్నారు. గుడివాడ ప్రాంతం నుండి ఎన్టీఆర్, ఏఎన్నార్, కైకాల, ఘంటసాల వంటి ఎందరో కళాకారులు కళామతల్లి ముద్దుబిడ్డలుగా వెలుగొందారన్నారు. అంతటి చరిత్ర కల్గిన కళాకారుల వారసులుగా నేటికీ కళాకారుల సమాఖ్య తరపున అనేక మంది కళాకారులు కళారంగానికి సేవలందిస్తూ వస్తున్నారన్నారు.

కళాకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కళాకారులు ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నా వాటిని తన దృష్టికి తీసుకురావాలని, వీటిని శాయశక్తులా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు కళాకారుల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం జగన్మోహనరెడ్డికి కళాకారులంతా మద్దతుగా నిలవాలని మంత్రి కొడాలి నాని కోరారు.