హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)
హైదరాబాదులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి వేళ నగరవాసులకు హైడ్రా హెచ్చరికలు జారీచేసింది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది.
భారీ వర్షం కారణంగా జనం అవస్థలు పడుతున్నారు. కొండాపూర్, హఫీజ్ పేట్, మాదాపూర్, మియాపూర్ లో భారీ వర్షం పడింది. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. ఐటీ కారిడార్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కొన్ని రోడ్లు నాలాలను తలపిస్తున్నాయి. రాయదుర్గం, బయోడైవర్సిటీ, ఐకియా జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ నేపథ్యంలో చాంద్రాయణ గుట్టలో పెను ప్రమాదం తప్పింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గ్రూప్ సెంటర్ చాంద్రాయణ గుట్టలో ప్రహరీ గోడ కూలిపోయింది. సాయంత్రం కురిసిన వర్షానికి గోడ కూలిపోయింది.
గోడ కూలిన సమయంలో దరిగుండా ఎర్టిగా కారు వెళ్లింది. కానీ కారు తృటిలో ఈ ప్రమాదం నుంచి బయటపడింది. అలాగే గోడ పక్కన ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.